- వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం
- తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జనవరి మొదటి వారంలో కొరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాసరావు వెల్లడించారు. కొరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మొదటి విడతలో వైద్య సిబ్బందికి కొరోనా వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఆ తరువాత 4 విభాగాలలో పనిచేస్తున్న 75 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తామనీ ఇందుకోసం మొత్తం 3 కోట్ల వ్యాక్సిన్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 22లోగా వ్యాక్సిన్ పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనీ, వ్యాక్సిన్ రవాణాకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశామని వెల్లడించారు.
కొరోనా వ్యాక్సిన్ను మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయడానికి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాక్సిన్ను పంపాల్సి ఉందనీ, 4 వారాల వ్యవధిలో ఒక్కొక్కరికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వనున్నామనీ, పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల మాదిరిగా వ్యాక్సిన్ పంపిణికి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గంట పాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు.