Take a fresh look at your lifestyle.

విద్యారంగంపై కొరోనా పిడుగు

  • ఈ ఏడాది పాఠశాలల పున:ప్రారంభం లేనట్లే
  • కేంద్రం నిబంధనలు సడలించినా పట్టని రాష్ట్ర ప్రభుత్వం
  • స్మార్ట్ ‌ఫోన్లు లేక పేద విద్యార్థులు చదువుకు దూరం
  • ఇప్పటికీ నిర్ణయం ప్రకటించని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ
  • ప్రైవేటు విద్యా సంస్థల్లో జూమ్‌ ‌యాప్‌ద్వారా  తరగతులు

కొరోనా దెబ్బతో ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. గత మార్చిలో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇప్పటి వరకు మూతపడే ఉండగా మిగతా విద్యా సంవత్సరం కూడా పూర్తిగా తుడిడిపెట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌ 5.0‌లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభించడానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలను తిరిగి ప్రారంభించుకునే అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసిన తరువాతనే విద్యా సంస్థల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అన్‌లైన్‌ ‌లేదా దూర విద్యా బోధనకే ఆయా విద్యా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అలాగే, పాఠశాలలు తెరిచిన తరువాత కూడా ఆన్‌లైన్‌ ‌తరగతులు కొనసాగి విద్యార్తులు వాటికి హాజరు కావడానికికే ప్రాధాన్యం ఇస్తే వారికి తప్పనిసరిగా అనుమతించాలని పేర్కొంది. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలనీ, హాజరును తప్పనిసరి చేయకూడదనీ, ఈ విషయంలో పూర్తిగా తల్లిదండ్రుల అనుమతి మేరకే నడచుకోవాలని స్పష్టం చేసింది. కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల ప్రారంభ తేదీలపై హోం శాఖతో సంప్రతించి నిర్ణయం తీసుకోవాలనీ, పరిశోధక విద్యార్థులను, ప్రయోగశాలలతో పని ఉండే సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ పీజీ విద్యార్థులను ఉన్నత విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థల విషయంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు నవంబర్‌ ‌నెలాఖరు వరకూ విద్యా సంవత్సరాన్ని తిరిగి ప్రారంభించవద్దని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ఈ విద్యా సంవత్సరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం….రాష్ట్రంలో పాఠశాలలను తెరిచిన పక్షంలో ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ? విద్యార్ధులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి ? అనే అంశంపై కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, ‌గంగుల కమలాకర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌ ‌సభ్యులుగా కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఒకమారు సమావేశమై విద్యా సంవత్సరం ప్రారంభంపై చర్చించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌కు నివేదించి అనంతరం ఆయన సూచనల మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ప్రకటన చేసి నెల రోజులు గడచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల ప్రారంభంపై స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం శోచనీయమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో టీవీల ద్వారా విద్యా బోధన కూడా నామమాత్రంగానే సాగుతున్నది. టీ శాట్‌, ‌నిపుణ వంటి కార్యక్రమాల ద్వారా విద్యా బోధన జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఇప్పటికీ చాలా మంది నిరుపేదల ఇళ్లలో టెలివిజన్‌లు లేవు. దీంతో వారంతా విద్యాబోధనకు దూరమవుతున్నారు. ఇక ప్రెవేటు విద్యా సంస్థలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు భిన్నంగా యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నాయి. జూమ్‌ ‌యాప్‌ ‌ద్వారా ఆ విద్యా సంస్థలలో ఆన్‌లైన్‌ ‌పద్దతిలో ఉపాధ్యాయులు ఇప్పటికే దాదాపు సగం సిలబస్‌ను పూర్తి చేశారు. వచ్చే మార్చిలో వార్షిక పరీక్షల నిర్వహణకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వం కావాలనే విద్యా సంవత్సరాన్ని కాలరాస్తోంది : అజయ్‌ ‌బాబు టీపీటీఎఫ్‌ అకడమిక్‌ ‌సెల్‌ ‌రాష్ట్ర కమిటీ సభ్యుడు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా సంవత్సరాన్ని కాలరాస్తున్నదని టీపీటీఎఫ్‌ అకడమిక్‌ ‌సెల్‌ ‌రాష్ట్ర కమిటీ సభ్యుడు అజయ్‌ ‌బాబు పేర్కొన్నారు. కోవిడ్‌ను ఎదుర్కునే విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిందనీ, కేవలం ఆదాయ వనరు కాదనే ఉద్దేశ్యంతోనే పాఠశాలల ప్రారంభాన్ని విస్మరిస్తున్నదని ఆరోపించారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో అందుబాటులో ఉండే ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, నర్సులు, ఏఎన్‌ఎం‌లు వంటి వైద్య సిబ్బంది సహకారంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, పాఠశాలలను శానిటైజ్‌ ‌చేయడం, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించడం వంటి పద్దతులు పాటించడం ద్వారా పాఠశాలలను నిర్వహించవచ్చనీ, అయితే, ప్రభుత్వానికి విద్యా రంగాన్ని కాపాడాలనే శ్రద్ధ లేని కారణంగానే రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రతీ ఏటా విద్యా రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా బడ్జెట్‌లో విద్యా రంగానికి కోతపెడుతున్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

ప్రభుత్వానికి విద్య ప్రాధాన్యత అంశం కాదు : రవి యుటిఎఫ్‌ ‌ప్రధాన కార్యదర్శి
విద్యా రంగం ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాల్లో లేదనీ, ఈ కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా హీన స్థితికి చేరుకుందని యూటీఎఫ్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభించే అంశంపై గత నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ ‌సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుందనీ, సీఎం కేసీఆర్‌ ‌సూచనల మేరకు రాష్ట్రంలో పాఠశాలల పున:ప్రారంభంపై కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించిందనీ, అయితే, నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఏదీ అమలులోకి రాలేదని పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించే అంశంపై విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడం, షిప్ట్ ‌పద్దతి, రోజు విడచి రోజు తరగతులు నిర్వహించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో వచ్చే నెల నుంచి కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, కనీసం ఆ దిశగానైనా తెలంగాణ ప్రభుత్వం అలోచన చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనాప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులతో సమావేశం నిర్వహించి వారి సూచనల మేరకు పాఠశాలలను పున:ప్రారంభించాలని ఆయన సూచించారు.

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply