Take a fresh look at your lifestyle.

పల్లెలకు విస్తరిస్తున్న కొరోనా ముప్పు

ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా కేసులు భారీగా నమోదు కాకపోవడంతో ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బ తినలేదు.అక్కడ కూడా కేసుల తీవ్రత పెరిగితే ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదముంది.కావున కొరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి.  ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటిస్తూ కొరోనా వైరస్‌ ‌కట్టడికి మనమందరం కృషి చేయవల్సిన అవసరం ఉంది.గ్రామాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. 

పల్లెల్లో కొరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది.కోద్దీ వారాల క్రితం రాష్ట్రంలో జి హెచ్‌ ఎం ‌సి మరియు పరిసరాల్లోని జిల్లా కేంద్రాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాల్లో మరియు ముఖ్యంగా పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. రాష్ట్రం లోని మారుమూల గ్రామాలకు కూడా వైరస్‌ ‌శరవేగంగా విస్తరిస్తున్నది.రోజువారీ నమోదవుతున్న కొరోనా కేసుల్లో నాలుగింట మూడవ వంతు జిల్లా కేంద్రాలలో మరియు గ్రామాలలో నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలో ఇప్పటికే 270 మండలాలు,1500 గ్రామాల్లోకి  కోవిడ్‌  ‌మహమ్మారి వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తున్నది. కొన్ని గ్రామాల్లో 50 నుండి 100 వరకు కేసులుంటున్నవి. ఇదే తీరు కొనసాగితే త్వరలోనే కొరోనా బారిన పడే గ్రామాల సంఖ్య 5000కు పైగా పెరిగే అవకాశం కలదు. అలాంటి  పరిస్థితి వస్తే ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇప్పటి వరకు పట్టణాల కంటే పల్లెలే  సురక్షితం అనే భావన ఉంది.కానీపెండ్లిళ్లు,ఫంక్షన్స్, ‌వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామీణ ప్రజలు ఎక్కువ మందిని ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోకుండా  కలుస్తున్నారు. హైదరాబాద్‌, ‌ముంబై తదితర మహా నగరాల్లో ఉపాధి కోల్పోయిన వారు మరియు అక్కడ కేసులు అధికం కావడంతో చాలా మంది సొంత గ్రామాలకు తిరిగి వచ్చారు.ఇలా ఒక్కో గ్రామానికి పదుల సంఖ్యలో తిరిగి వచ్చారు.అలాంటి  కొందరితోవారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్నది.

కొరోనా వ్యాప్తిపై అవగాహన పెరగడంతో నగరాల్లో చాలా మంది కొరోనా పరీక్షలు చేయించుకొని పాజిటివ్‌ అని తేలగానే ఊళ్ళకు వెళ్లిపోతున్నారు. వీళ్ళలో కొందరు అన్ని జాగ్రత్తలను తీసుకుంటుండగా మరికొందరు క్వారంటైన్‌ ‌పేరుతో ఊళ్లకు ఆర్టీసీబస్సుల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో వారు తమకు తెలియకుండానే దారి పొడవునా వైరస్‌ ‌వ్యాపింప చేస్తున్నారు.తోటి ఉద్యోగులకు, పక్కింటివారికి కొరోనా సోకిందని తెలియగానే చాలా మంది సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఇలా ఇళ్లకు వెళ్లినవారిలో కొంత మందికి కొద్దిరోజుల తరువాత లక్షణాలు వెలువడడం, వైరస్‌ ‌బారినపడడం జరుగుతున్నది.మొత్తానికి చాలా మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైరస్‌ను నగరాల నుండి పల్లెలకు మోసుకొని పోతున్నారు.కొరోనా వ్యాప్తికి ప్రయాణాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీనితో పాటు గ్రామీణప్రాంతాల నుండి సమీప పట్టణాలకు, నగరాలకు, వ్యాపార, వ్యవసాయ ఇతర అవసరాల నిమిత్తం నిత్యం రాక పోకలు కొనసాగుతున్నవి. దీనితో పట్టణాల నుండి మరియు నగరాల నుండి వైరస్‌ ‌వ్యాప్తి పల్లెలకు చేరుతున్నది.కొందరి  నిర్లక్ష్యం కూడా పల్లెలకు శాపంగా మారుతున్నది. కొరోనా సోకుతుందని తెలిసి కూడా ఫ్రెండ్స్‌తో కలిసి ముచ్చట్లు, మందు పార్టీలు, యువత మరియు పిల్లలు సామూహికంగా ఆటలు ఆడటం వంటివి కూడా గ్రామాల్లో వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నవి.

గ్రామీణ ప్రజల్లో కొరోనా  వ్యాప్తి పట్ల అవగాహన లేకపోవడంతో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువయి పోయింది.పొలం పనులలో కొంత మంది  ఎక్కడకూడా వ్యక్తిగత దూరం పాటించడం లేదు.ముఖానికి మాస్క్ ‌లాంటిది ధరించినా కూడా వారు దాన్ని సరియైన విధానంలో ఉపయోగించడం లేదు.యూనివర్సిటీ అఫ్‌ ‌హైదరాబాద్‌ ‌వారు నిర్వహించిన సర్వే లలో గ్రామాలలో ఇప్పటికి కొరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన చాలా తక్కువని తేలింది.మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, సానిటైజెర్లు ఉపయోగించడం, పరిశుభ్రంగా ఉండడం, భౌతిక దూరం పాటించడం వంటి ముఖ్యమైన జాగ్రత్తలపై కూడా వారికి సరియైన అవగాహన లేక వాటిని చాలా మంది పాటించడం లేదు. గ్రామాల్లోని బెల్ట్ ‌షాపులు ,కిరాణా షాపులు, మటన్‌ ‌సెంటర్‌లు, చికెన్‌ ‌సెంటర్‌లు,హోటళ్ళు నిర్వహించే వారుగాని, అక్కడికి వచ్చేవారు గాని ఎవరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఆ ప్రాంతాలు కూడా వైరస్‌ ‌వాహకాలుగా మారుతున్నవి.చాలా మందికి వైరస్‌ ‌లక్షణాలు కనిపించినా బయటకు తెలియకుండా ఇండ్లలోనే ఉంటూ  స్వంత వైద్యం చేసుకుంటున్నారు. అలాంటి వారి ఇండ్లలోని వ్యక్తులు కూడా బయట తిరగడంతో వైరస్‌ ‌వ్యాప్తి అధికమవుతున్నది. తెలిసిన వాళ్ళే కదా అనే భావనతో కలిసి మెలిసి తిరగడం కూడా వైరస్‌ ‌వ్యాప్తికి కారణమవుతున్నది.నగరాల్లో వైరస్‌ ‌వ్యాప్తి ఎక్కువగా ఉంది.ఇలాంటి సమయంలో రకకరకాల కారణాలతో పల్లెలకు వెళ్లడం మంచిది కాదు.అత్యవసరమైతే  తప్ప ప్రయాణం చేయవద్దు.ఈ మధ్య లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉంటున్నాయి వీరిలో చాల మంది తమకు తెలియకుండానే  వైరస్‌  ‌క్యారియర్లుగా మారుతున్నారు. వైరస్‌ ‌సోకినట్లు కూడా వీరికి తెలియదు.దీంతో వారంతా కుటుంబ సభ్యులతో యధావిధిగా కలిసి వుంటున్నారు. వీరు బయటి నుంచి వైరస్‌ ‌మోసుకొచ్చి ఇంట్లో వున్న వృద్దులకు విస్తరింపచేస్తున్నారు. వీరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా వ్యాధికి గురి అవుతున్నారు.పల్లెల్లో కేసులు పెరిగితే మరణాల శాతం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది .గ్రామాల్లో వైరస్‌ ఎక్కువయితే తట్టుకోవడం కష్టం.ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు తక్కువగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు.

వృద్ధులు, పిల్లలు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక  వ్యాధిగ్రస్తులు, గుండె, కిడ్నీ, కాన్సర్‌ ‌వంటి సమస్యలున్నవారిని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిని చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచాలి.వారిని ఎట్టి పరిస్థితిలోను బయటకు రానీయవద్దు. సాధ్యమైనంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరించే ఆర్‌ ఎం ‌పి ల సేవలను వినియోగించుకోవాలి. వారు గ్రామాల్లో కొరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి.పాజిటివ్‌ ‌లక్షణాలున్న వారిని ప్రారంభంలోనే గుర్తించి వారిలో దీర్ఘ కాలిక వ్యాధులున్న వారికి చికిత్స అందిస్తే వారి ప్రాణాలను కాపాడిన వారమవుతాం.పల్లెల్లో కొందరు లక్షణాలు తీవ్ర మయ్యే వరకు హాస్పిటల్‌కు రావడానికి ఇష్టపడక, సొంత వైద్యం చేసుకుంటూ, ఆర్ధికంగా భారం అవుతుందన్న పలు కారణాలతో ఆలస్యంగా రావడం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. అందుకే కొరోనా లక్షణాలున్న వారిని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరణాలను తగ్గించినవారమవుతాం. జి హెచ్‌ ఎం ‌సిలో మాదిరి గానే సంచార పరీక్షల వాహనాలను గ్రామాల్లోకి పంపించి కొరోనా లక్షణాలను ఉన్నవారిని గుర్తించి తగిన వైద్యం అందించగలిగితే వైరస్‌ ‌వ్యాప్తిని కట్టడి చేయగలం.

ముఖ్యంగా గ్రామాల్లో కొరోనా భాదితులను చిన్న చూపు చూసే ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి  ‘మీరు పోరాడాల్సింది రోగితో కాదు … వ్యాధితో…  కొరోనా బాధితులను పరిరక్షించండి’. అని కొన్ని నెలలుగా ఎవరికీ ఫోన్‌ ‌చేసిన వచ్చే సందేశం వింటూ కూడా కొరోనా రోగుల పట్ల చాల మంది  వివక్ష చూపుతున్నారు.మానవత్వాన్ని మరిచి కొరోనా భాదితులను, వారి కుటుంబసభ్యులను  వెలి వేసినట్లు చూస్తున్నారు కొన్ని చోట్ల వైరస్‌ ‌సోకినా వారు ఊర్లో ఉంటె మిగతా వారికీ కూడా అంటుకుంటుంది అని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మ విశ్వసం నింపాల్సిన  చుట్టుపక్కల వారు, వారిని కొన్ని సందర్భాలలో వూరి నుండి వెళ్లి పొమ్మని కూడా ఒత్తిడి చేస్తున్నారు.దీనితో కొరోనా బాధితులపై మానసిక ఒత్తిడి ఎక్కువై, గుండె జబ్బుల బారిన పడి  అకస్మాత్తుగా చనిపోతున్న సంఘటనలు కూడా మనం వార్తా పత్రికల్లో చూస్తున్నాము. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తికి సంబంధించి ప్రజలకు  అధికారులు  సరియైన అవగాహన కల్పించక పోవడం వలన వైరస్‌ ‌సోకిన వారిని మిగతా వారు దోషులుగా చూస్తున్నారు.

గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది,ప్రజా ప్రతినిధులు,గ్రామ పంచాయతీ సిబ్బంది,స్వచ్చంధ సంస్థలు ,యువజన సంఘాలు, అధికారులు అందరు కలిసి కొరోనా వైరస్‌ ‌సోకకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి మరియు వైరస్‌ ‌సోకితే ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంశాలపై సరియైన అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తే వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట వేసిన వారమవుతాం. ప్రభుత్వం కూడా పల్లెల్లో వైరస్‌ ‌కట్టడికి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలి. ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేస్తూ కొరోనా భాదితులకు అండగా నిలుస్తూ భరోసా నివ్వాలి.

ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా కేసులు భారీగా నమోదు కాకపోవడంతో ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బ తినలేదు.అక్కడ కూడా కేసుల తీవ్రత పెరిగితే ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదముంది.కావున కొరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి.  ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటిస్తూ కొరోనా వైరస్‌ ‌కట్టడికి మనమందరం కృషి చేయవల్సిన అవసరం ఉంది.గ్రామాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది.

pulluru venugopal
పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

Leave a Reply