Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలు ముమ్మరం చేయాలి

కొ‌రోనా రోగులకు చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌వైఖరి గురించి ఎన్నో ఫిర్యాదులు వొస్తున్నాయి. వీటిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ఈ నెల 24 లోగా స్పష్టమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మార్చి 24కి ముందు రాష్ట్రంలో ప్రజారోగ్యం విషయంలో ఉన్న పరిస్థితినీ, ప్రస్తుత పరిస్థితి ని బేరీజు వేస్తూ కొరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. అంటే, తెలంగాణ ప్రభుత్వం కొరోనా చికిత్స ల విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారం కాదని స్పష్టం అగుతుంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ 161 ‌ఫిర్యాదులు అందాయనీ, వాటిని 38 హాస్పిటల్స్ ‌కు నోటీసుల ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ, ఆ హాస్పిటల్స్ ‌పేర్లు వెల్లడించలేదు. వాటిపై తీసుకున్న చర్యలేమిటో వెల్లడించలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొరోనా పరీక్షలు, మరణాలపై ప్రభుత్వం అందజేస్తున్న సమాచారంలో పొంతన లేదని కూడా హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలను బట్టి ఇంత కాలం ప్రతిపక్షాలు, ప్రజాహిత సంస్థలు కొరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత గురించి చేస్తున్న ఆరోపణలు నిరాధారం కాదని స్పష్టం అయింది.

ముఖ్యంగా, పక్క రాష్ట్రంలో కొరోనా కేసులు రోజుకు వేల సంఖ్యలోనూ, మరణాల సంఖ్య వందల్లో నమోదు అవుతున్న తరుణంలో తెలంగాణలో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 850 దాటలేదంటే, కొరోనా వైద్యం అందరికీ అందుతోందనేగా, అలాంటప్పుడు ఫిర్యాదులు ఎందుకు వొస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారంలో సమగ్రత లేదనీ, లేదా తప్పుల తడక అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంతేకాక, కోవిడ్‌ ‌కారణంగా మరణించిన వారి మృత దేహాలను బంధువులు తీసుకుని వెళ్ళేందుకు నిరాకరిస్తే హైదరాబాద్‌ ఈఎస్‌ ఐ ‌స్మశాన వాటిక లో సామూహికంగా అంత్యక్రియలు జరిపించారన్న వార్తలు వొచ్చాయి. ఆ వార్తలను తెరాస ప్రభుత్వం ఖండించడమే కాకుండా, ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారంటూ ఎదురు దాడి చేసింది. ఇప్పుడు మరణాల సంఖ్యపై హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుంది. అంతేకాక, రోజుకు పది మంది కోవిడ్‌ ‌తో చనిపోతున్నారా అని ప్రశ్నించింది. కొరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎంత ఖర్చు చేసిందో చెప్పమని కూడా రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిందంటే, ప్రకటనలే తప్ప కొరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన రీతిలో నిధులు ఖర్చు చేయడం లేదన్న అర్థం వస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్ ‌పై ప్రభుత్వానికి ఎంత మాత్రం అదుపు లేదన్న విషయం స్పష్టం అవుతుంది. అంతేకాక, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన హాస్పిటల్స్‌లో 50 శాతం బెడ్స్ ‌పేదలకు కేటాయించేందుకు అంగీకరించాయని చెప్పినా, వాటి వివరాలు అందజేయనందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్న పిటిషనర్ల వాదనపై హైకోర్టు స్పందించింది.ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేనందుకు అసంతృప్తిని వ్యక్తం చేసింది.జిల్లాల్లో కొరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. కొరోనా వ్యాధిగ్రస్తులను హైదరాబాద్‌ ‌కు హుటాహుటిన తరలించేందుకు తగిన సౌకర్యాలు కూడా లేవు. హైదరాబాద్‌ ‌లో కూడా గాంధీ , కోఠీ దవాఖానా లో తప్ప మరెక్కడా పేదలకు వైద్యం అందడం లేదు. అక్కడ కూడా సిఫార్సులు, పలుకుబడి ఉన్నవారికే వైద్యం అందుతోంది. ప్రభుత్వ దవాఖానల తీరు గురించి ఎన్నో సార్లు పత్రికలూ, ప్రసార మాధ్యమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల నుంచి కొరోనా వ్యాధిగ్రస్తులను హైదరాబాద్‌ ‌తరలించడానికి తగినన్ని అంబులెన్స్ ‌లను ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ సూచన ప్రతిపక్షాలు ఏనాడో చేశాయి. తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల సూచనలనూ, మీడియా సూచనలను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొరోనాపై ఎవరైనా మాట్లాడితే రాజకీయ కోణం నుంచి చూసి ఆరోపణలను కొట్టి వేస్తుంది. ఎదురు దాడి చేస్తుంది. హెల్త్ ‌బులిటన్‌ ‌ల విడుదల విషయంలోనూ కార్పొరేట్‌, ‌ప్రైవేటు హాస్పిటల్స్ ‌పారదర్శకతను పాటించడం లేదు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో కొరోనా చికిత్సలకు ముందే లక్షలకు లక్షలు కట్టించుకుంటున్నారు. వ్యాధి తో వ్యక్తి మరణించినా ఆ డబ్బు వాపస్‌ ఇవ్వడం లేదు.

ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మృతుడి బంధువులు హాస్పిటల్స్ ‌సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. హాస్పిటల్స్ ‌పై దాడులు కూడా చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై కూడా హైకోర్టు స్పందించింది. ఈ హాస్పిటల్స్ ‌ల్లో వసూలు చేసే ఫీజులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నేషనల్‌ ‌ఫార్మాసూటికల్‌ ‌ప్రైజింగ్‌ అథారిటీని ఆదేశించింది. కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌దోపిడీ గురించి మీడియా పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు, కథనాలు వెలువడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్ 50 ‌శాతం బెడ్స్ ‌కేటాయించేందుకు అంగీకరించాయని చెప్పినా, వాటి వివరాలను ఎందుకు అందజేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. శుక్రవారం నాడు రాష్టప్రభుత్వంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొరోనా చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి అద్దం పడుతున్నాయి. ఈనెలాఖరున సమర్పించే నివేదికలో సమగ్రమైన సమాచారాన్ని అందివ్వకపోతే హైకోర్టు మరింత సీరియస్‌ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజాహిత సంస్థలు కోరుతున్నాయి. కొరోనా పరీక్షల విషయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాగైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మళ్ళీ పిలిపించాల్సి ఉంటుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరీక్షల విషయంలో కోర్టు ఎంత సీరియస్‌ ‌గా ఉందో స్పష్టం అవుతుంది. పక్క రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతుంటే, తెలంగాణలో ఇంత తక్కువగా కేసులు ఎలా నమోదు వుతున్నాయన్న అనుమానాలు సామాన్యులకు సైతం వ్యక్తం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కోవిడ్‌ ‌పరీక్షలపై దృష్టిని కేంద్రీకరించాలి.

Leave a Reply