Take a fresh look at your lifestyle.

పల్లెల్లో కొరోనా ప్రమాద ఘంటికలు

  • ఇప్పటికే రాష్ట్రంలోని 1500 గ్రామాలకు వ్యాప్తి
  • ఆగస్టు నెలాఖరుకు మరో 5 వేల గ్రామాలకు

కొరోనా మహమ్మారి పల్లెలను వణికిస్తున్నది. కొద్ది రోజుల క్రితం వరకూ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలకే పరిమితమైన వైరస్‌ ‌క్రమంగా పల్లెలకూ వేగంగా విస్తరిస్తున్నది. గత రెండు నెలలుగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన మేడ్చల్‌, ‌రంగారెడ్డిలో తగ్గుతుండగా, ఇప్పుడు జిల్లాలలో విజృంభిస్తుండటం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రస్తుతం కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌సంగారెడ్డి జిల్లాలలో ప్రతీ రోజూ వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం…ప్రస్తుతం రాష్ట్రంలోని 270 మండలాలు, 1500 గ్రామాలలోకి కోరోనా వైరస్‌ ‌విస్తరించింది. ఇదే తీరు కొనసాగితే త్వరలోనే ఈ వైరస్‌ ‌బారిన పడిన గ్రామాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ హైదరాబాద్‌ ‌నగరంలో పాజిటివ్‌ ‌కేసులు ఎక్కువ నమోదవుతుండటంతో రాజధానిలో స్థిరపడ్డ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు భయంతో తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. నగరంతో పోలిస్తే గ్రామాలలో కొరోనా కేసులు తక్కువ అనే అభిప్రాయంతో ఉన్న ప్రజలు ఇప్పుడు అక్కడ కూడా పెరుగుతున్న కేసులతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది పదిహేను రోజులుగా వ్యవసాయ పనులు, వివాహాలు, ఇతర శుభ కార్యాల నిమిత్తం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువ మందిలో కలవాల్సి వస్తోంది. దీనికి తోడు కొరోనా భయంతో హైదరాబాద్‌ ‌నుంచి సొంత గ్రామాల నుంచి వచ్చిన వారితోనూ వైరస్‌ ‌విస్తరించడమే గ్రామాలలో ఇటీవలి కాలంలో కొరోనా కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి కారణమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కొద్ది వారాల క్రితం వరకు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట వంటి జిల్లాలలో సైతం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైరస్‌ ‌వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఆగస్టు నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మరో 5 వేల గ్రామాలకు విస్తరించే అవకాశం ఉందని ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌జిల్లా దవాఖానాల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా పల్లె ప్రాంతాల్లో కొరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కేసుల సంఖ్య ప్రతీ రోజూ వందకు పైగా నమోదవుండగా….మరికొన్ని జిల్లాలలో ఇరవై లోపే నమోదవుతుండటం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఊరట కలిగిస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌నారాయణపేట, నిర్మల్‌, ‌వికారాబాద్‌, ‌వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో కేసుల సంఖ్య అతి స్వల్పంగా ఉండటంతో ఆక్కడి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను పరిశీలించి వాటినే తమ జిల్లాలలోనూ అమలు చేయాలని కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!