కరోనా వైరస్ తో ప్రజలు ఆందోళనచెందుతుంటే వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన లక్ష్మణ్ కుమార్ తోపాటు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేసేందుకు గాను కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పేదలపక్షపాతన్నారు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి బీడు భూములను సాగులోకి తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారని కొనియాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ, జగిత్యాల ప్రాంతంలో జెఎన్టీయూ కళాశాల, పశువైద్య కళాశాల ఏర్పాటు చేసి ఈప్రాంతాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.ఆనాడు గ్రామ గ్రామాన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి రైతులకు మేలు చేశారని పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సాహాన్ని అందించారన్నారు. పేదలకు కార్పోరేటు ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడఃతో పాటు 108 తో ఎందరో ప్రాణాలను కాపాడి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్సార్ అని ప్రశంసించారు.వైఎస్సార్ కార్యకర్తలకు గుర్తింపు నిచ్చి ఆయన కాలంలో చేపట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని ,చిరకాలం గుర్తుంటాయన్నారు.రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు తాటి పర్తి దేవేందర్ రెడ్డి,గుంటిజగదీశ్వర్, గాజుల రాజేందర్, శరత్ రెడ్డి, బింగి రవి, మహిపాల్, రమేష్ రావు, రజనీకాంత్, శ్రీకాంత్, శ్రీనివాస్, కమటాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.