Take a fresh look at your lifestyle.

ఏపీ మాదిరిగా కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

  • ప్రజల ప్రాణాలు కాపాడమంటే అరెస్టు చేస్తారా
  • ఎంఎల్‌ఏ ‌సీతక్క ప్రజారోగ్య ఆమరణ దీక్ష భగ్నం
  • ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో సహా హాస్పిటల్‌కు తరలింపు

కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడమంటే అరెస్టు చేస్తారా అని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొరోనా వైరస్‌ ‌చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సోమవారం నుండి కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌ ‌యూఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌ధర్నాచౌక్‌ ‌వద్ద మండుటెండలో ప్రజారోగ్య ఆమరణ దీక్ష చేపట్టిన సీతక్కను మంగళవారం పోలీసులు అరెస్ట్ ‌చేశారు. సీతక్క ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెతో సహా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ ‌వెంకట్‌ ‌లను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగటంతో ధర్నా చౌక్‌ ‌వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొరోనా మహమ్మారి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శవాలను తీసుకుపోయే ఆర్థిక స్థోమత కూడా లేనందున ఉచిత అంబులెన్సు సేవలను అందించాలన్నారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఇప్పటి వరకు ప్రైవేటు దవాఖానల్లో ఫీజులు కట్టి వైద్యం చేసుకున్న వారందరికీ సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో కరోనా ట్రీట్మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చారని, రాష్ట్రంలో మాత్రం టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కొరోనా చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటళ్లలో చేరి జనం ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. దీక్షకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అక్కడ టెంట్‌ ‌కూడా వేయనివ్వలేదు. దీంతో సీతక్క నేలపైనే కూర్చొని విద్యార్థులతో కలసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఎండలు తీవ్రం కావడంతో కార్యకర్తలు ఎస్‌ఎస్‌ ‌యూఐ జెండాలతో సీతక్కకు నీడను కల్పించారు.

Leave a Reply