- అత్యధిక మరణాలు హైదరాబాద్‌లోనే నమోదు
- టెస్టులు, చికిత్సలను పట్టించుకోని ప్రభుత్వం
- జనసంవాద్ ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కరోనాతో హైద్రాబాద్ నగరం ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌజ్‌లో ఉంటున్న కెసిఆర్ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేంద్రం రెండు బృందాలను పంపి సలహాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి, కేంద్రాన్ని విమర్శించిందని ఆయన అన్నారు. అత్యధిక మరణాలు హైదరాబాద్ లో నమోదు అవుతున్నాయని, ఒక లాబ్ లో టెస్ట్ చేసిన దాంట్లో 71 శాతం పాజిటివ్ కేసులు వచ్చాయని, హైదరాబాద్ ని గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జన్ సంవాద్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగింస్తూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కాపాడుతుంది అని అనుకోకుండా, ఆశలు పెట్టుకోకుండా మనకు మనమే జాగ్రత్తగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సహాయం చేసిందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే సహాయం కేంద్రం చేసిందని అన్నారు. 2.5 లక్షల కిట్స్ 6.5 లక్షలు మాస్క్‌లు, 22 లక్షల టాబ్లెట్స్ తెలంగాణకి ఇచ్చామని ఆయన అన్నారు. ఒంటెద్దు పోకడలతో సకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా దారుసలం, మజ్లీస్ ఆదేశాల పై ప్రభుత్వం నడుచుకుంటుందని అన్నారు. తెలంగాణను ఓవైసీ, కల్వకుట్ల కుటుంబాల నుంచి కాపాడుకోవాల్సి ఉందన్నారు. ప్రజలు భయ పడుతున్నారు, ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్వేచ్ఛ నిచ్చామని, ’ప్రభుత్వ పరంగా లోపం ఉంది.. ప్రగతి భవన్ లో నిర్ణయం తీసుకోవడం లేదు.. కష్ట పడడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని’ ఆయన అన్నారు. టెస్ట్‌ల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రాన్ని పాలించాల్సిన పెద్దలే ఫార్మ్ హౌస్ లో ఉంటే ఎలా ? హైదరాబాద్ ప్రజలు ఎక్కడికి పోవాలి ? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో 20 లక్షల టెస్ట్‌లు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు.. యుద్ధ ప్రాతిపదికన టెస్ట్ లు చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల నుండి తెలంగాణను కాపాడాలని ఆయన అన్నారు. కుటుంబ పాలనకు, మతోన్మాద పార్టీ లతో అంతకాగే పార్టీ లకు చరమ గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాటల, కోతల ప్రభుత్వం తప్ప బంగారు తెలంగాణ ఏది ? ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరుల ఆకాంక్షల కోసం పని చేసే ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం అమలుకాకుండా.. కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రధాని మోదీ పరిపూర్ణత తెచ్చారని చెప్పారు. రక్తపుబొట్టు చిందకుండా ఆర్టికల్ 370 రద్దు చేశారని, 70 ఏళ్లుగా ఆర్టికల్ 370 పేరుతో కశ్మీర్‌ను కాంగ్రెస్ దోచుకుందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చదువుకోవాల్సిన పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టిందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.