Take a fresh look at your lifestyle.

కోవిడ్ రెండో దశలోనూ మేల్కోని ప్రభుత్వాలు

లాక్ డౌన్ పేరుమీద ప్రకటించిన ప్యాకేజీలు ఎవరికి లాభాలు చేకూర్చాయో కూడా తెలిసిందే. ప్రభుత్వ బాధ్యతల్ని నిక్కచ్చిగా గుర్తుచేస్తూనే ప్రజాబాహుళ్యంలో మరింత అవగాహన కోసం ప్రయత్నించాలి. ఏ సందర్భం లోనైనా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పండగలు, పుష్కరాలు, ఎలక్షన్ల, రాజకీయ సమీకరణాల పేరుతో అనేక ఉల్లంఘనలు ప్రభుత్వాల వైపు నుంచే జరుగుతున్నాయి. కానీ నింద ప్రజల మీదకు తోసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యపాత్ర వహించేది ప్రజల అవగాహన, చైతన్యం. ఇప్పుడు కావలసింది మనిషికి మనిషి సాయం. సమూహాలుగా హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కోవటానికి, పరిష్కారం వైపుగా సన్నద్ధం కావాలి.

sajaya sanketham‘మహేష్’ (అసలు పేరు కాదు) తల్లిదండ్రులు లేని పంతొమ్మిది సంవత్సరాల యువకుడు. దాతల సాయంతో హైదరాబాద్ లోని ఒక హాస్టల్ లో వుండి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ మధ్యే తెరిచిన కాలేజీలను కోవిడ్ రెండో దశ కారణంగా మళ్లీ మూసేయటంతో గాంధీనగర్లో స్నేహితుల గదిలో తాత్కాలికంగా తలదాచుకుంటున్నాడు. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలోనూ వుండటానికి చిన్న ఆధారం కూడా దొరకక అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఈ రెండో దశలో కోవిడ్ వైరస్ బారిన పడ్డాడు. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితిలో ఎక్కడ ఉండాలనేది సమస్య. స్నేహితులదే చిన్న గది. పైగా నలుగురైదుగురు వుండటం. ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లే ఆర్ధిక స్తోమత లేదు. కాబట్టి అరకొరగా వున్న ప్రభుత్వ వ్యవస్థల మీదే ఆధారపడాలి.

ఒకపక్క కోవిడ్ అనారోగ్యం, అపోహలతో భయం, టెన్షన్. దానికితోడు పక్కన ఎవరూ సహాయానికి రాలేని పరిస్థితి. చికిత్స కోసం ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)’కి (తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో గచ్చిబౌలిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.) వెళ్లమన్న మిత్రుల సలహాతో అవసరమైన రిపోర్ట్స్ తీసుకుని గాంధీనగర్ నుంచీ ఆటోలో వెళ్ళాడు. బెడ్స్ ఖాళీ లేవని అతన్ని అక్కడ చేర్చుకోకుండా మెహదిపట్నంలోని సరోజినీ కంటి హాస్పిటల్లో ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ కి వెళ్లమని చెప్పారు. గచ్చిబౌలి నుంచీ మళ్లీ మెహదిపట్నం వరకూ ఆటోలో వెళ్లాడు. అక్కడ కూడా మహేష్ ని చేర్చుకోలేదు. డాక్టర్లు, సిబ్బంది, ఇతర ఏర్పాట్లు సిద్ధంగా లేవని చెప్పి, వేరే ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు.

కోవిడ్ కారణంగా అప్పటికే మహేష్ బాగా అలసిపోయాడు. ఆయాసం పెరగటంతో అక్కడి వారి సలహా తీసుకుని అక్కడినుంచీ ముషీరాబాద్లో వున్న గాంధి హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ మహేష్ ని పరీక్షించిన వైద్యసిబ్బంది ఇంట్లోనే వుండి చికిత్స తీసుకోమని చెప్పి అడ్మిట్ చేసుకోలేదు. మళ్లీ అక్కడి నుంచీ బయలుదేరి తెలిసినవాళ్ల సహాయంతో అమీర్పేట్ లోని ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ సెంటర్లో చేరాడు. ఉదయం ఎనిమిది గంటలకి రూమ్ నుంచి బయలుదేరిన మహేష్ కి చికిత్స కోసం ఒక గూడు దొరకటానికి దాదాపు రాత్రి అయింది. మధ్యలో ఆకలి వేస్తే రద్దీగా వున్న ఒక హోటల్ లో భోజనం చేయాల్సి వచ్చింది. అంటే దాదాపు పన్నెండు గంటలపాటు ఒక కోవిడ్ పాజిటివ్ పేషంట్ చికిత్స కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళుతూ జనం మధ్యనే గడపాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణంలో అతను ఒక ప్రాంతం నుంచీ ఇంకో ప్రాంతానికి వెళ్లటానికి నాలుగైదు ఆటోలు ఎక్కాల్సి వచ్చింది.

ఇలాంటి పేషంట్లు ఎంతమంది వున్నారో మనకు తెలిసే అవకాశం లేదు. బతుకుతెరువు, చదువు, ఇతర అవసరాల కోసం నగరాలకి, పట్టణాలకి వలస వచ్చే అత్యంత సామాన్య పేద ప్రజానీకం అనారోగ్యం బారిన పడితే ఏ వ్యవస్థలు అందుబాటులో వున్నాయి? ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ సమయంలో మనిషిని మనిషే అనుమానంగా చూస్తున్న సమయంలో, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళల్లో, ఇంటికి ఇంటికి మధ్య ఒక గోడ అడ్డంతో పది పదిహేనుమంది కలిసి ఒక బాత్రూం, లెట్రిన్ పంచుకునే కిక్కిరిసిన పరిస్థితుల్లో జీవించేవారే ఈ దేశంలో అత్యధిక జనాభా. అసలు నెత్తిమీద ఇంత గూడు కూడా లేని నిరాశ్రయుల పరిస్థితి చెప్పనవసరమే లేదు. మరి వీళ్ళందరికీ కోవిడ్ సోకితే ఎక్కడ వుండాలి? వీళ్లెవరికీ లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకునే అవకాశం వుండదు.

corona second wave in india states

అక్కడకు వెళ్ళగలిగిన స్తోమత వున్నవారికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి వుంది. మరి ఇలాంటప్పుడు వివిధ వర్గాల ప్రజలందరికీ అనుకూలంగా ఉండేవిధంగా ప్రణాళిక రచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ, ప్రజా సమూహాలతో పనిచేసే స్వచ్చంద సంస్థల సహకారంతో కోవిడ్ హెల్ప్ డెస్క్, ‘కమ్మ్యూనిటీ కేర్ సెంటర్స్’ ఏర్పాటు చేయమని 2020 ఏప్రిల్ నుంచీ పౌర సమాజ సంఘాలు పదేపదే విజ్ఞప్తులు చేసినా గానీ తెలంగాణ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. ప్రజా సమూహాలతో ఒక సంభాషణను అంగీకరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం వినిపించుకోవాలంటే న్యాయస్థానంలో కేసు వేయటం తప్ప ఇంకో మార్గం లేకుండా చేశారు. ఇదొక విషాదం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ‘కోవిడ్ హెల్ప్ డెస్క్’లతో పాటు ప్రతి మండల పరిధిలో ‘కమ్మ్యూనిటీ కేర్ సెంటర్స్’ ఏర్పాటు అత్యంత ముఖ్యమని హైకోర్ట్ ఆదేశించినా వాటి అమలు ఎంతవరకూ అయ్యిందనేది ప్రశ్నార్ధకమే! కేవలం పరీక్షా కేంద్రాలే కాక, కనీసం ప్రతి డివిజన్ పరిధిలో నయినా ఒకటో రెండో ‘కమ్మ్యూనిటీ కేర్ సెంటర్స్’ నిజంగా ఏర్పడి వుండి, వాటి నిర్వహణ బాధ్యతలో స్వచ్చంద సంస్థలు, ఇతర ప్రజా సంఘాలు పాలుపంచుకోగలిగి వుండి వుంటే, ఏ ఆధారం లేని మహేష్ లాంటి యువకుడు అనారోగ్యంతో అల్లాడుతూ అలా తిరిగే పరిస్థితి వస్తుందా?

కోవిడ్ జాగ్రతలు తీసుకోవాలని పదేపదే ఫోన్లలోనూ, టీవీల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో చెబితే సరిపోతుందా? సరిపోదనే మనకు ఎదురవుతున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. మౌలిక సదుపాయాల రూపకల్పన ఎవరి బాధ్యత? కోవిడ్ రెండో దశ వస్తుందని ఊహించలేదని మంత్రులు ప్రకటిస్తున్నారంటేనే ఇప్పటివరకూ సమస్య పరిష్కారానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వైపుగా దృష్టి సారించలేదనేగా అర్థం. వాక్సిన్ ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన పట్ల చూపించలేదు! వ్యాక్సిన్ అవసరమా కాదా అనేది కాదు ఇక్కడ చర్చ. కోట్లమంది జనాభాలో అవసరమైనవారికి సరైన సమయంలో సదుపాయాలు చేకూర్చగలిగిన వ్యవస్థలను ఎంత సమర్ధవంతంగా ఏర్పాటు చేయగలిగారు అనేది ప్రశ్న? అది ఐసోలేషన్ సెంటర్స్ కావొచ్చు, వ్యాక్సిన్ కేంద్రాలు కావొచ్చు. ఇక్కడ రెండు విషయాలు చర్చించాలి. ఒకటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, రెండు ప్రజల అవగాహన. రెండూ పరస్పరం సంబంధం వున్న అంశాలు. కానీ, పరిస్థితి చేయి దాటిపోయేవరకూ ప్రభుత్వాలు మిన్నకుండిపోతాయి.

ఆ తర్వాత ప్రజలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ముందు జాగ్రతలు తీసుకోకుండా గుంపులుగా తిరుగుతున్నారని, పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారని తీవ్ర విమర్శలు చేయటం. కోవిడ్ మొదటి దశలో పదుల సంఖ్యలో వైరస్ కేసులు వున్నప్పుడు ఏకపక్షంగా లాక్ డౌన్ విధించిన పాలకులకు ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందనే అవగాహన లోపించిందనేది స్పష్టం. కోవిడ్ మళ్ళీ పెరుగుతోంది అనే పేరుతో కాలేజీలు, పాఠశాలలను మూసేసిన రాష్ట్రప్రభుత్వం జనసమ్మర్ధంగా వుండే పబ్బులు, సినిమాహాళ్ళు, సూపర్ మార్కెట్లు, మాల్స్, హోటల్స్, వైన్ షాపులు, బార్లు, పార్కులు, గుళ్ళు, మసీదులు, చర్చ్ లు, పర్యాటక ప్రాంతాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివాటిపై నియంత్రణ ఎక్కడా పెట్టలేదు. రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలు, వేలాదిమందితో ఎలక్షన్ల బహిరంగ సభలు యథావిధిగా జరుగుతూనే వున్నాయి. కానీ ప్రజాసమస్యల మీద గళం వినిపించే ఏ చిన్న సమావేశానికైనా కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అనుమతి నిరాకరిస్తారు.

పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధిస్తుందేమోనన్న భయ సందేహాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ప్రజల్ని సమాయత్తం చేయకుండా, సరైన ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధాన ఫలితం అందరం చూశాం. వలస కూలీలు పడ్డ యాతనలు చూశాం. దేశంలోని అన్ని రంగాలు ఎంతగా కష్టనష్టాలకు గురయ్యాయో తెలిసిందే. లాక్ డౌన్ పేరుమీద ప్రకటించిన ప్యాకేజీలు ఎవరికి లాభాలు చేకూర్చాయో కూడా తెలిసిందే.

hyderabad corona cases today

ప్రభుత్వ బాధ్యతల్ని నిక్కచ్చిగా గుర్తుచేస్తూనే ప్రజాబాహుళ్యంలో మరింత అవగాహన కోసం ప్రయత్నించాలి. ఏ సందర్భం లోనైనా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పండగలు, పుష్కరాలు, ఎలక్షన్ల, రాజకీయ సమీకరణాల పేరుతో అనేక ఉల్లంఘనలు ప్రభుత్వాల వైపు నుంచే జరుగుతున్నాయి. కానీ నింద ప్రజల మీదకు తోసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యపాత్ర వహించేది ప్రజల అవగాహన, చైతన్యం. ఇప్పుడు కావలసింది మనిషికి మనిషి సాయం. సమూహాలుగా హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కోవటానికి, పరిష్కారం వైపుగా సన్నద్ధం కావాలి.

Leave a Reply