Take a fresh look at your lifestyle.

పండుగల సంబురాన్ని దెబ్బతీసిన కొరోనా, వర్షబీభత్సం

ఈసారి బతుకమ్మ, దసరా పండుగల సందడిని, సంబురాలనూ కోవిడ్‌-19, అకాల వర్షాలు, వరదలు మింగేశాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. ఎక్కడ చూసినా పెను వర్షాలు సృష్టించిన బీభత్స దృశ్యాలే కనిపిస్తున్నాయి. మహానగరమైన హైదరాబాద్‌లో ఇంకా అనేక కాలనీలు జలమయంలో, బురదమయంలో ఉన్నాయి. కోవిడ్‌ ‌ప్రభావం ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు ఇంతకుముందే పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజల్లో ఉత్సాహం నీరు గారింది. వర్షాలకు బాగా నానిన ఇళ్ళల్లో కి చొచ్చుకుని వచ్చిన వరద నీరు ఇంకా తీయలేదు. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని పాత తరం వారు చెబుతున్నారు. బతుకమ్మ, దసరాల పండుగలు ఈ సారి మొక్కుబడిగా సాగుతున్నాయి. నిరంతర ప్రసార మాధ్యమాలు ఉండటం వల్ల ఆ మాత్రమైనా హడావుడి కనిపిస్తోంది. వీధుల్లో, గల్లీల్లో, ఎక్కడ చూసినా నీటి మడుగులు ఉన్న పరిస్థితులలో బతుకమ్మ ఎలా ఆడతారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ వేడుకను ఎక్కడిక్కడ జరుపుకుంటున్నట్టు ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలకు తెలుస్తోంది. నిత్యావసర వస్తువులను వర్షాల పేరిట దాచి పెట్టి అధిక ధరకు విక్రయిస్తున్న తరుణంలో మామూలు రోజువారి జీవనమే గడవడం కష్టంగా ఉన్న తరుణంలో పండుగ లేం జరుపుకుంటారు. సంప్రదాయంగా పండుగకు వండే పిండి వంటలు, అల్లుళ్ళ కోసం ప్రత్యేక దినుసులు, కొత్త బట్టలు, అమ్మవారి ఉత్సవాలు, ఇవన్నీ మొక్కుబడిగా సాగిపోతున్నాయి. పండుగ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాని, ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు మొక్కుబడిగానే పండుగల శుభాకాంక్షల ట్విట్టర్‌ ‌సందేశాలతో సరిపెడుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బెంగాల్‌లో దసరా సంబురాలను గురించి గుర్తు చేశారు. పండుగ నాడు పప్పన్నం అయినా తినేట్టు లేదనే వారు. ఈసారి కూరలు లేకుండా పండుగ జరుపుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వానగాలులకు కూరగాయల తోటలన్నీ కుప్పకూలాయి. రక్షిత మంచినీరు కూడా ఈ సారి పండుగకు అమృతంలా తయారైంది. నల్లాల్లో వొచ్చే నీరును కాచుకుని తాగాలని మంత్రి కెటి రామారావు ఇంతకుముందే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పంటలు వర్షార్పణం అయ్యాయని చెప్పి ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల పర్యవేక్షించే యంత్రాంగం కరువైంది.

ప్రజా ప్రతినిధులు అధినేతల మెప్పుకోసం శుభాకాంక్షలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వర్షపు నీటిలో మునిగిన ఒక కాలనీలో మహిళలు ఒక కార్పొరేటర్‌ను చొక్కా పట్టుకుని నిలదీసిన సంఘటనను నిరంతర వార్తా ప్రసార సాధనాల్లో కొద్ది రోజుల క్రితం ప్రజలంతా తిలకించారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు అంతా వర్ష బాధితుల సమస్యలపైనే తాము దృష్టిని కేంద్రీకరించామని ప్రకటనలు చేస్తూ ప్రజలను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. ఉల్లి పాయల కొరత తీవ్రతతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. జనతా ప్రభుత్వ హయాంలో ఉల్లిపాయల కొరత రాజకీయాస్త్రం అయింది. రాజకీయ నాయకులు ఉల్లిపాయలను అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై పోరు సాగించిన రోజులవి. ఇప్పుడు కొరోనా వ్యాక్సిన్‌ అధికార పార్టీపై విమర్శలకు ప్రతిపక్షాలకు అస్త్రం అయింది. బీజేపీ చేసిన తెలివితక్కువ తనం వల్ల వ్యాక్సిన్‌ ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. నిజానికి మన దేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాల్లో కొరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతోంది. వ్యాక్సిన్‌ ‌తయారీ వివిధ దశల్లో ఉందన్న వార్తలే కానీ, ఎవరూ ఖచ్చితంగా ఎప్పుడు వొస్తుందో చెప్పలేకపోతున్నారు. తిండి లేకపోయినా, పండుగ సరదాలు లేకపోయినా వ్యాక్సిన్‌ ఇస్తే చాలునన్న స్థితికి ప్రజలు చేరుకున్నారు. అసలు వ్యాక్సిన్‌ ‌వొస్తుందా దాని వల్ల కొరోనా పూర్తిగా పోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

పాలకుల అనాలోచిత వైఖరులు, ముందు చూపు లేకపోవడం, ప్రజలను మభ్య పెటే ధోరణుల వల్ల ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రజల్లో సహనం నశిస్తోంది. ఆందోళన, కలవరం లేకపోతే పస్తులుండైనా పండుగలను గడపవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే కొరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఎలా నీరుగారిపోయాయో స్పష్టం అవుతోంది. చేయకపోయినా, చేసినట్టు మభ్యపెట్టే ధోరణుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మధ్యలో ఎన్నికలు చొచ్చుకుని రావడంతో రాజకీయ లబ్ధి కోసం అంతర్జాతీయ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకూ అందరి ధోరణి ఒకే రీతిలో ఉంది. ధరలు పెరగడం పండుగనాడు చేదు అనుభవాలు కలుగడం ఎప్పుడూ ఉండేదే అయినా, ఈ సారి కొరోనా, కుంభవృష్టిల దెబ్బతో ప్రజల్లో నైరాశ్యం అలుముకుంది. ప్రజలకు ధైర్యం చెప్పే రాజకీయ నాయకత్వం కొరవడింది. ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ అంతా ధైర్యం చెబుతూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, అవి ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. ధరలు, కాలుష్యం, పరిసరాల వాతావరణం ప్రజల దైనందిన జీవితాన్ని దారుణంగా దెబ్బతీశాయి. సంప్రదాయకంగా గుడిగోపురాలు సందర్శించేవారు సైతం ఈ బురదలో ఎక్కడికి వెళ్తామంటూ ఇళ్ళవద్దే కాలక్షేపం చేస్తున్నారు. పండుగల ఉత్సాహం ఈ సారి నీచేతను, నా చేతను అన్న రీతిలో అందరి వల్లా నీరుగారి పోయింది.

Leave a Reply