Take a fresh look at your lifestyle.

కొరోనా పాజిటివిటీ రేటు 0.4 శాతానికి తగ్గింది

  • మూడో వేవ్‌ ‌వొచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం
  • హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా పాజిటివిటీ రేటు 0.4 శాతానికి తగ్గింది. ఈమేరకు రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ హైకోర్టుకు బుధవారం నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన తరువాత మూడు వేల పాఠశాలల్లో కోవిడ్‌ ‌పరీక్షలు చేయగా, కేవలం 195 మంది విద్యార్థులకు మాత్రమే కోవిడ్‌ ‌గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కొరోనా ముప్పును సాధ్యమైనంత త్వరగా తప్పించాలన్న లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ వేగంగా చర్యలు చేపట్టిందనీ, ఇందులో భాగంగా ఇప్పటి వరకు కోటి 8 లక్షల మందికి రెండు డోసుల టీకా పూర్తి చేశామని వెల్లడించింది. ప్రస్తుతం 60 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయనీ, రాష్ట్రంలో 42 లక్షల మంది ఒక్క డోసు కూడా వేసుకోని వారు ఉన్నారని పేర్కొంది.

ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలో కొరోనా పాజిటివిటీ శాతం భారీగా తగ్గిందనీ ఒకవేళ మూడో వేవ్‌ ‌వొచ్చినా ఎదుర్కునేందుకు ప్రభుత్వ దవాఖానాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నివేదికలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రభుత్వ, 76 ప్రైవేటు కేంద్రాలలో ఆర్టీపీసీఆర్‌, 1231 ‌కేంద్రాలలో రాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌పరీక్షలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో మే 6 నుంచి జ్వర సర్వే కొనసాగుతున్నదనీ, మూడో దశలో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో  చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పడకలు సిద్ధం చేశామని ఇందుకోసం వైద్య, పారామెడికల్‌ ‌సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు హైకోర్టుకు  సమర్పించిన నివేదికలో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో 82 ఆక్సీజన్‌ ‌ప్లాంట్లను ఏర్పాటు చేశామనీ వాటిలో ప్రస్తుతం 75 పని చేస్తున్నాయని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌ ‌నియంత్రణకు వైద్యారోగ్య శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వమే అన్నీ చేయలేదనీ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply