హన్మకొండలో తొలిసారిగా ఓ పదేళ్ళ బాలికకు కొరోనా ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వడ్డెపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూరిగుట్ట ప్రాంతంలోని పది సంవత్సరాల బాలికకు పరీక్షలు చేయగా కొరోనా పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం గుర్తించినట్లు జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ కె.లలితాదేవి ప్రకటించారు. ఈ బాలికను వెంటనే చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పూరిగుట్ట ప్రాంతాన్ని కంటెయిన్మెంట్గా ప్రకటించినట్లు తెలిపారు. బుధవారం పూరిగుట్ట ప్రాంతంలో ఇంటింట సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇండ్లలో ఉండాలని డిఎంహెచ్ఓ కోరారు.
కాగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఢిల్లీ మర్కజికి వెళ్ళి వచ్చిన వారిలో 25 మందికి కొరోనా పాజిటివ్ రాగా, గత నెలలో వారిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇటీవల నలుగురు కోలుకోగా వారిని డిశ్చార్జి చేశారు. అయితే కొరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా నగరంలోని 15 ప్రాంతాలను రెడ్ జోన్లుగా పెట్టారు. తాజాగా పూరిగుట్ట ప్రాంతాన్ని కూడా రెడ్జోన్లో పెట్టారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన కొరోనా పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తులవే. తాజాగా పదేళ్ళ బాలికకు కొరోనా పాజిటివ్ రావడం సెకండరీ కాంటాక్టు నగరంలో ప్రబలుతుందని అధికారులు బావిస్తున్నారు. అందులో ప్రజలందరూ లాక్డౌన్ పూర్తిగా పాటించి ఇళ్ళలోనే ఉండాలని, కొరోనా వ్యాధి భారీన పడవద్దని డిఎంహెచ్ఓ కోరారు.