Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌

  • ఐటీ ఉద్యోగుల్లో కలకలం
  • ఇంటి వద్దనుంచే పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ

హైదరాబాద్‌ ‌సాఫ్ట్ ‌కేర్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హైటెక్‌ ‌సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్‌ ‌స్పేస్‌ ‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇందులోని బిల్డింగ్‌ ‌నంబర్‌ 20‌లో ఉన్న ఐటీ కంపెనీ(డీఎస్‌ఎం ‌సంస్థ)లో పని చేస్తున్న ఒక ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌ ‌రిపోర్ట్ ‌వచ్చింది. దీంతో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అలజడి నేపథ్యంలో అక్కడి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. వర్క్ ‌ఫ్రం హోమ్‌ ఆదేశాలను జారీ చేస్తున్నాయి.
మహీంద్రాహిల్స్‌లో ‘కరోనా’ తొలి కేసు..భయంతో నిర్మానుష్యంగా కాలనీ హైదరాబాద్‌లోని మహీంద్రాహిల్స్ ‌కాలనీలో కరోనా వైరస్‌ ‌తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇళ్ల నుంచి కాలనీ వాసులు బయటకు రావడం లేదు. ఈ కాలనీ వైపు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఆ కాలనీ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది జాడ కూడ లేదు. ‘కరోనా’ ఎఫెక్ట్ ‌తో ఈ ప్రాంతంలోని పలు స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు.

గాంధీ ఆస్పత్రిలో పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్‌ అనుమానిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో అనుమానిత కేసులు వస్తున్నాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ ‌వార్డులో కేవలం 40 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్డు మొత్తం నిండిపోయింది. గత 40 గంటల వ్యవధిలో 50 అనుమానిత కేసులు గాంధీ ఆసుపత్రికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో పెయిడ్‌ ‌రూమ్స్ ‌ను కూడా ఐసొలేషన్‌ ‌కోసం వినియోగిస్తున్నారు.

కేటీఆర్‌ ఆదేశాలతో మెట్రో భోగీలు శుభ్రం
హైదరాబాద్‌ ‌మెట్రో రైల్లో ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రైలు బోగీలు కిటకిటలాడుతుంటాయి. మరోవైపు నగరంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల ఆరోగ్యరీత్యా మెట్రోరైలు బోగీలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా సూచించారు. కేటీఆర్‌ ‌సూచనతో మెట్రో అధికారులు వెంటనే కదిలారు. మెట్రో సిబ్బంది బోగీలను కడిగి శుభ్రం చేశారు. బోగీలలోని సీట్లు, హ్యాండిల్స్, ‌ద్వారాలను శుభ్రం చేశారు. ప్రయాణికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మెట్రో పరిసరాలు, రైళ్లు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

హైదరాబాద్‌ ‌నగరంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌..‌గాంధీ ఆసుపత్రి పరీక్షల్లో వెల్లడి

రెండు రోజుల కిందట భాగ్యనగరంలో మొదటి కేసు నమోదవగా.. తాజాగా మరో ఇద్దరిలో వైరస్‌ ‌లక్షణాలను గుర్తించారు. గాంధీ మెడికల్‌ ‌కాలేజీలోని ఐసీఎమ్‌ఆర్‌ ‌ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. దాంతో, వారి శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలాజీ(ఎన్‌ఐవీ)కి పంపించారు. గురువారం ఎన్‌ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్‌ఐవీలో కూడా పాజిటివ్‌ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు. ఈ ఇద్దరిలో ఒకరు వైరస్‌ ‌బారిన పడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి కాగా, మరొకరు ఇటలీకి వెళ్లొచ్చినట్టుగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వారితో సహా మంగళవారం మొత్తం 47 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా 45 మంది రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయి. వాళ్లందరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ‌చేశామని, 14 రోజుల పాటు తమ నివాసాల్లో ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్టు గాంధీ ఆసుపత్రి ప్రజారోగ్య డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌జి. శ్రీనివాస్‌ ‌రావు తెలిపారు. ఇక, కరోనా బారిన పడి గాంధీ ఐసోలేషన్‌ ‌వార్డులో చికిత్స పొందుతున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy