Take a fresh look at your lifestyle.

20‌మంది చిన్నారులకు కొరోనా పాజిటివ్‌

  • కుటుంబ సభ్యుల ద్వారా వ్యాప్తి చెందిందన్న అనుమానం
  • గాంధీలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా పాజిటివ్‌ ‌కేసులు ఆందోళన పుట్టిస్తుండగా.. తాజాగా 12 ఏళ్ల లోపు 20 మంది చిన్నారులకు కోవిడ్‌ ‌సోకినట్టు నిర్దారణ అయింది. చిన్నారులకు వారి కుటుంబ సభ్యుల నుంచి కొరోనా సోకినట్లు గుర్తించారు. వారికి గాంధీ ఆస్పత్రిలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ‌నిబంధనల మేరకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. గాంధీలోని ఆరో ప్లోర్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి 20 మంది ప్రత్యేక వైద్య నిపుణులు చిన్నారులకు సేవలందిస్తున్నారు. వీరిలో నెలల చిన్నారి కూడా ఉండడం విశేషం.

వీరిలో మర్కజ్‌ ‌వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిద్వారానే వీరికి సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ చైన్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుంటే చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని గాంధీ వైద్యులు తెలిపారు. వారిలో 3 ఏళ్ల బాలుడికి ఇతర ఆరోగ్యసమస్యలు ఉండటంతో చికిత్స అందించడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం త్వరలో మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం మరో 52 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 644కి చేరుకుంది. కరోనాతో 18 మంది మృతి చెందారు. మొత్తం 110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 516 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

Leave a Reply