- ఒక్కరోజే కొత్తగా 1,15,736 కేసులు నమోదు
- రికార్డ్ స్థాయిలో పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన
- 24 గంటల్లో 630 మంది మృతి
- మొత్తం 8,70,77,474 మందికి టీకా
- యూపిలో రెండు డోసుల టీకా తీసుకున్న డాక్టర్లకూ కొరోనా
దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కేసులు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తాజాగా విడుదల చేసిన కొరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్ అని చెప్పొచ్చు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1,28,01,785కి చేరింది. ఇందులో 1,17,92,135 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,43,473 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో దేశంలో కొరోనాతో 630 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,66,177కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 59,856 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 8,70,77,474 మందికి టీకా అందించారు. దీంతో దేశంలో మొత్తం కొరోనా బాధితుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ హైకోర్టు వైరస్ కట్టడికి పలు సూచనలు చేసింది. మాస్క్‌ను సురక్షణ కవచంగా పేర్కొంటూ, ఎవరైనా సరే కారులో ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ అనేది కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకుంటుందని తెలిపింది. ఢిల్లీలో కొరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూను విధించింది.
వైరస్ చైన్ తెగ్గొట్టేందుకు నైట్ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఢిల్లీలో మాస్క్ పెట్టుకోని వారి నుంచి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో కొరోనా వైరస్ కోరలు చాచింది. 40 మంది డాక్టర్లకు కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇందులో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కేవీ పూరి కూడా ఉన్నారు. గమనించాల్సిన విషయమేమిటంటే.. వీరంతా కొరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. వైరస్ సోకిన వారిలో 20 మంది సర్జరీ డిపార్ట్మెంట్, 9 మంది యూరాలజీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్లు ఉన్నారు. మరో ముగ్గురు క్రిటికల్ కేర్ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన వారు ఉన్నారు. అయితే కొరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ నిర్దారణ కావడం ఆందోళన కలిగిస్త్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఒక్కరోజే 5,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 13న 6,239 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్యకు చేరువలో కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నోలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 1188 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు చనిపోయారు. ఇక వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం కొరోనా టీకా తీసుకున్నారు. ఇంతకు ముందు ఒమర్ అబ్దుల్లా తండ్రి, ఎన్సీ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కొరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
అనంతరం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అంతకు ముందే ఆయన టీకా మొదటి డోసు తీసుకున్నారు. జనవరి 16న ప్రారంభమైన.. టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీకా వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 8.70 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్‌కు కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్లో వెల్లడించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, బెంగళూరు, ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.