Take a fresh look at your lifestyle.

హెల్త్ ‌సెంటర్లలో నీటి కొరతతో కొరోనా వ్యాప్తి డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనంలో వెల్లడి

హెల్త్ ‌సెంటర్లలోని నీటి సంక్షోభం కారణంగా కొరోనా వైరస్‌ ‌మరింత వ్యాప్తి చెందేందుకు కారణమౌతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది. దీంతో బాధితులతో పాటు సిబ్బంది కూడా అనారోగ్యం బారిన పడుతున్నారని తమ నివేదికలో హెచ్చరించింది. 165 దేశాల నుండి సేకరించిన సమాచారంతో ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల సంరక్షణ సంస్థ యునిసెఫ్‌తో కలిసి ఈ నివేదికను రూపొందించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. సరైన నీటి వసతి లేకపోవడం, పారిశుద్ధ్య సౌకర్యాల కొరత, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య  డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపింది. అలాగే వ్యక్తిగత రక్షణ లేకుండా సేవలు చేయడం కూడా కొరోనా వ్యాప్తికి కారణమని తెలిపింది.
సాధారణంగా కొరోనా వ్యాప్తి నివారణలో కీలకమైనవి ఇవేనని, కానీ ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఓ ‌చెప్పింది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పేద దేశాలు కొట్టుమిట్టాతున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ ‌తెలిపారు. వైద్య సిబ్బంది ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది మాత్రమే ఉండగా.. కొరోనా బారిన పడిన వారిలో 14 శాతంగా నమోదవడం తీవ్రతను తెలుపుతోందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేకుండా వారిని విధులు నిర్వర్తించమనడంతో వారి ప్రాణాలకు హాని కలుగుతోందని యునిసెఫ్‌ ‌చీఫ్‌ ‌హెన్రియోట్టా ఫోరే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మూడింట ఒక వంతు ఆరోగ్య కేంద్రాల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా సరైన వసతులు లేవని, ప్రతి పదింటిలో ఒకదానిలో టాయిలెట్‌ ‌వంటి పారిశుధ్య సేవలు అందుబాటులో లేవని నివేదికలో తెలిపిందన్నారు. పేదరికం, సౌకర్యాల లేమితో ఉన్న 47 దేశాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కనీసం తాగేందుకు కూడా నీటిసదుపాయాలు లేవన్నారు.

Leave a Reply