Take a fresh look at your lifestyle.

కొత్త వేరియంట్ల రూపంలో కొరోనా

ఏ డాదిన్నరపాటు ఫ్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్‌ 19 ఇప్పుడే శాంతిస్తున్నటు అనిపిస్తున్నా, కొత్త వేరియంట్లు ముంచుకొస్తూ మరోసారి జనాభాను వణకిస్తున్నది. భారతదేశంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే మహమ్మారి ముప్పు తగ్గిపోతుందని ప్రజలు సంతోషించేలోపే.. కొత్త రకం డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌భయాందోళనలు కలిగిస్తోంది. కొరోనా వైరస్‌ ఏడాదిన్నర కాలంలో అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందింది. వీటిలో కొన్ని వేరియంట్లు ప్రాణాంతకంగా మారాయి. ఈ క్రమంలో భారత్‌ ‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్‌.. ‌దేశంలో రెండో దశ కొరోనా ఉద్ధృతికి కారణమైందని పరిశోధనలు తెలిపాయి. ఆ తరువాత ఇతర దేశాలకు సైతం డెల్టా రకం వైరస్‌ ‌వ్యాపించింది. ఇప్పుడు దీని నుంచి కొత్తగా డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ఉత్పరివర్తనం చెందినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌ప్రధానంగా వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం, ఊపిరితిత్తుల కణాలకు నేరుగా అంటుకుపోవడం, మోనోక్లోనల్‌ ‌యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం.. వంటి ప్రధాన లక్ష్ణాలు ఈ వైరస్‌ ‌లో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.

నేటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల34 లక్షల 63 వేల 661 మందికి కొరోనా వ్యాధి సోకగా, 16 కోట్ల 79 లక్షల 62 వేల 056 మంది కోలుకున్నారు. 39 లక్షల 72 వేల 576 మంది కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలో ముంచి ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ ‌లో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు ఇటీవల 3 కోట్లు దాటాయి. తాజాగా కొరోనా మరణాలు 4 లక్షలకు చేరుకున్నాయి. మే నుంచి దాదాపు నెల రోజులపాటు పాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొరోనా కట్టడి చర్యలలో భాగంగా లాక్డౌన్‌, ‌కర్ఫ్యూలు విధించడంతో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 46,617 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం వైరస్‌ ‌బాధితుల సంఖ్య 3 కోట్ల 4 లక్షల 58 వేల 251 కు చేరుకుంది. పాజిటివ్‌ ‌కేసులు, కోవిడ్‌19 ‌మరణాలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 853 మంది కొరోనాతో చనిపోయినవారి సంఖ్య 4 లక్షలు దాటింది. ఇప్పటివరకూ 4 లక్షల 312 మందిని కొరోనా మహమ్మారి బలిగొంది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ కొత్త వేరియంట్‌ ‌థర్డ్ ‌వేవ్‌ ‌కు కారణం కావచ్చని నిపుణులు భవిస్తున్నారు. డెల్టా ప్లస్‌ ‌కొరోనా వైరస్‌ ‌వేరియంట్‌ ‌కేసులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య విభాగం ఎప్పటికైనా ఆందోళనకరమేనని పేర్కొని, వైరస్‌ ‌వ్యాప్తి నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రారంభంలో దేశాలకు విస్తరించిన కోవిడ్‌ ‌స్ట్రెయిన్లను నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసినా రోగనిరోధకత వ్యవస్థ నుంచి తప్పించుకునే లక్షణాలు కొత్త వేరియంట్లలో ఉండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పించగలవా లేదా అని నిపుణులు నిర్ధారించకపోవడంతో అయోమయంలో పడిపోయినట్లయింది. డెల్టా వేరియంట్‌ అనేక దేశాలకు విస్తరించిందని.. మున్ముందు ఇది ప్రపంచవ్యాప్త ప్రాబల్య స్ట్రెయిన్‌ ‌గామారే ప్రమాదం ఉందని డబ్ల్యూ.హెచ్‌.ఓ. ఆం‌దోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ‌వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడి, హాస్పిటల్‌ ‌పాలైన కేసులు ఉన్నాయి. ఆందోళనకారక వేరియంట్ల వ్యాప్తి వేగం ఎక్కువ కాబట్టి కొవిడ్‌ ‌నిబంధనలను ఎక్కువ కాలం పాటించాల్సి వొస్తుందని.. వ్యాక్సినేషన్‌ ‌వేగం తక్కువగా ఉన్న దేశాలు త్వరపడి, ఆ దిశగా లక్ష్యాలను రూపొందించుకుని, నిర్ణీత సమయంలో టీకాలు వేయాలని సూచించింది.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఆల్ఫా (బ్రిటన్‌) ‌వేరియంట్‌ 172 ‌దేశాల్లో, బీటా (దక్షిణాఫ్రికా) వేరియంట్‌ 120 ‌దేశాల్లో, బ్రెజిల్‌ ‌వేరియంట్‌ 72 ‌దేశాల్లో ఉన్నాయి. కాగా.. డెల్టా ప్లస్‌ ‌కోవిడ్‌19 ‌వేరియంట్‌ ‌మరింత ప్రాణాంతకమని, దీని ద్వారా కొరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందని ప్రచారం జరుగుతోంది, అయితే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ప్రస్తుతానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆల్‌ ఇం‌డియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ ‌డైరెక్టర్‌, ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా పేర్కొన్నారు. భారత్‌ ‌లో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌లో అత్యధిక కేసులు రావడానికి కారణమైన వేరియంట్‌ ‌డెల్టా అని, దాని ద్వారా డెల్టా ప్లస్‌ ‌కోవిడ్‌19 ‌వేరియంట్‌ ‌పుట్టుకొచ్చిందని మాత్రమే సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం వైరస్‌ ‌నుంచి రక్షణ కల్పించే ఏకైక మార్గం వ్యాక్సిన్‌ ‌మాత్రమే. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కోవిడ్‌ ‌వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తేలింది. డెల్టా వేరియంట్‌ ‌సహా కొత్త వేరియంట్లపై కొన్ని టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ప్రజలందరూ వ్యాక్సిన్‌ ‌తీసుకోవడంతో పాటు కొరోనా మార్గదర్శకాలు పాటించడం ద్వారా వైరస్‌ ‌ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. భారత్‌ ‌లో మొదటి దశ తరువాత ప్రజలు కోవిడ్‌ ‌మార్గదర్శకాలను వొదిలేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రెండో దశలో వైరస్‌ ‌విజృంభించింది. ఇప్పుడిప్పుడే రెండో దశ ఉద్ధృతి తగ్గుతున్నందువల్ల ప్రజలందరూ కోవిడ్‌ ‌మార్గదర్శకాలు పాటించడం అవసరం. కొత్త వేరియంట్ల వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యం తోడైతే.. రానున్న రోజుల్లో కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌మరోసారి కోవిడ్‌19 ఆం‌క్షలు విధించింది. మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో ఒకటైన యూఏఈ ప్రభుత్వం కొరోనా థర్డ్ ‌వేవ్‌ ‌రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోంది.

యూఏఈ నుంచి భారత్‌, ‌పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌నేపాల్‌, ‌శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగండా, సియోరా లియోన్‌, ‌లైబీరియా, దక్షిణాఫ్రికా మరియు నైజీరియా దేశాలకు ప్రయాణాలు నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 14 దేశాలకు ప్రయాణాలపై జూలై చివరి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని విదేశాంగశాఖ, నేషనల్‌ ఎమర్జెన్సీ, డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇతర దేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు సైతం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కచ్చితమైన కోవిడ్‌19 ‌నిబంధనలు పాటిస్తూ కొరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జులై 21 వరకు 14 దేశాలకు విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ప్రతి ఒక్కరూ కచ్చితంగా బాధ్యతగా కొరోనా టీకాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మిక్సింగ్‌ ‌డోసుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు కానీ కొన్ని అధ్యయనాలు పరిశీలిస్తే.. వ్యాక్సిన్ల మిక్సింగ్‌ ‌డోసులతో ప్రయోజనం ఉందని, అదే సమయంలో దుష్పరిణామాలు కూడా ఉన్నాయని తెలిసింది.

Leave a Reply