Take a fresh look at your lifestyle.

దేశంలో ఒక్క రోజే భారీగా పెరిగిన కొరోనా కోత్త కేసులు

24 గంటల్లో 43,651 కొత్త కేసులు..640 మంది మృతి
న్యూఢిల్లీ, జూలై 28 : దేశంలో మంగళవారం ఒక్కరోజే కొరోనా కొత్త కేసులు అంతకు ముందు రోజు కన్నా భారీగా పెరిగాయి. సోమవారం 29,689 కొత్త కేసులు నమోదవగా.. తాజాగా ఏకంగా అంతకు ముందు రోజుకన్నా దాదాపు 14 వేలు పెరిగి కొత్తగా 43,651 కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్‌ ‌కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది కోలుకున్నారని తెలిపింది. కొరోనాతో మొత్తం 4,22,022 మంది కన్నుమూశారని తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 44,61,56,659 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆగస్ట్ 31 ‌వరకు కొరోనా గైడ్‌లైన్స్ ‌పొడిగింపు
రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా లేఖ
ఆగస్టు 31 వరకూ ‘కొరోనా గైడ్‌లైన్స్’ అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌భల్లా ప్రకటించారు. ఇప్పటికీ దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆయన లేఖ రాశారు. కొరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కొరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని హోంశాఖ సూచించింది. రానున్న రోజుల్లో పండగలు రాబోతున్నాయని, ప్రజల రద్దీని నియంత్రిస్తూ, నియమాలు అమలయ్యేలా చూడాలని కూడా కోరింది. పాజిటివిటీ రేటు తగ్గుతున్న ప్రాంతాల్లో క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని, అయితే కేసులు మాత్రం పూర్తిగా తగ్గలేదన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని సూచించింది. అందుకే నిర్లక్ష్యంతో వ్యహరించకూడదని, కొరోనా నియమాలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కోరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం నిత్యకృత్యం కావాలన్నారు.

Leave a Reply