Take a fresh look at your lifestyle.

కరోనా నెగెటివ్‌ ‌పరీక్షల కోసం ఆత్రుతగా చూపు

ఒకటికి రెండుసార్లు టెస్టులతో తడిసి మోపెడు
విజయవాడ : కరోనా మొదటి దశలో వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స చేయించుకున్న వారికి నెగిటివ్‌ ‌ఫలితం వచ్చేది. దాంతో వారు మానసిక ఆందోళన నుంచి తేరుకుని సాధారణ జీవనానికి వచ్చేవారు. అయితే సెకండ్‌ ‌వేవ్‌ ‌మ్యూటేషన్‌ ‌తీవ్రంగా ఉంటోన్నది. ముఖ్యంగా జ్వరం 100 నుంచి 102 డిగ్రీల మధ్యన 10 రోజుల వరకు ఉంటున్నది. అలానే రుచిని కోల్పోవడం, వాసన తెలియకపోవడం, దగ్గు రెండు, మూడు వారాలకు పైనే ఉంటున్నాయి. ఇక షుగర్‌ ‌వ్యాధిగ్రస్తులకు అయితే యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌వస్తున్నది. కొందరికి విరేచనాలు అవుతున్నాయి. అలానే ఒళ్లు నొప్పులు, నీరసం ఎక్కువగా ఉంటున్నది. లక్షణాలు బయటపడగానే కొంతమంది ప్రైవేటుగా ఆర్‌టీపీసీఆర్‌/‌యాంటీజెన్‌ ‌టెస్టులు చేయించుకుంటున్నారు.

పాజిటివ్‌ అని తెలియగానే చాలావరకు •ం ఐసోలేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో కరోనా ఎప్పుడు తమ దేహం నుంచి వెళ్లిపోతుందానని అదేపనిగా ఎదురు చూపులు చూస్తున్నారు. కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది.. •ం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడుతున్నారు.. అయితే నెగిటివ్‌ ‌రిపోర్టు కోసం తరచూ టెస్టులకు వెళ్తున్నారు. తమకు నెగిటివ్‌ ‌రిపోర్టు ఎప్పుడు వస్తుందానని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. వారంలో రెండు మూడు సార్లు పరీక్షలు చేయించుకుంటున్నా నెగిటివ్‌ ‌రిపోర్టు రాలేదని మానసిక ఆందోళనకు గురౌతున్నారు.

కొందరికైతే నాలుగు వారాలైనా ఇంకా పాజిటివ్‌ ‌రిపోర్టులే వస్తోండటంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ప్రతీసారి కరోనా టెస్టు చేయించుకునేందుకు రూ.1,500 అయినా ఏమాత్రం వెనకాడటం లేదు. వారం నుంచి రెండు వారాల వ్యవధిలో కొంతమంది రెండు, మూడు సార్లు టెస్టులు చేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆస్పత్రిలో కోలుకొని డిశ్చార్జి చేసిన వ్యక్తికి కూడా మూడు వారాల తర్వాత టెస్టు చేస్తే అదే పాజిటివ్‌ ‌వచ్చింది. దాంతో తమకు నెగిటివ్‌ ‌రిపోర్టు ఎప్పుడు వస్తుందా అని వారు తీవ్రంగా మథనపడుతున్నారు.

Leave a Reply