- ఒక్క ఆక్సీజన్ సిలిండర్‌కు రూ.లక్ష
- విక్రయాలపై నియంత్రణ లేని ప్రభుత్వం
- సరఫరా లేదంటూనే అధిక ధరలకు యాంటీ వైరల్ డ్రగ్స్
రాష్ట్రంలో ఓవైపు కొరోనా విజృంభిస్తుంటే మరోవైపు, అక్రమార్కులు ఔషధాల బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. మందుల విక్రయాలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఇదే అదనుగా రోగుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. కొరోనా రోగులకు అవసరమైన మందులతో పాటు అతి ముఖ్యమైన ఆక్సీజన్ సిలిండర్లను అసలు ధర కంటే వందల రెట్లకు పెంచి అమ్ముకుంటూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కొరోనా కేసులు భారీ సంఖ్యలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ దందా జోరుగా సాగుతోంది. రోగులు సైతం డబ్బులను లెక్క చేయకుండా సమయానికి దొరికిందే మహా భాగ్యం అన్నట్లుగా ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి మామూలుగా రూ. 10 వేల నుంచి 15 వేల వరకు ఉండే ఆక్సీజన్ సిలిండర్‌ను రూ.లక్ష వరకూ విక్రయిస్తున్నారు. కొరోనా రోగులు వైద్య చికిత్సల కోసం చేరుతున్న ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. ఆక్సీజన్ సిలిండర్లను రోగులకు విక్రయించాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఏ పేషెంట్‌కు ఏ అవసరం కోసం విక్రయిస్తున్నారు ? ఎంత ధరకు విక్రయిస్తున్నారు ? అనే వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమర్పించాలి. అయితే, అసలు అనుమతులే లేకుండా నగరంలో ఈ సిలిండర్లను యధేచ్చగా విక్రయిస్తుండటం గమనార్హం.
అదే విధంగా కొరోనా రోగులకు అత్యంత ఆవశ్యకమైన యాంటి వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ ఔషధాల కోసం నగరంలో పలు ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలు ఔషధ డీలర్లకు బల్క్ ఆర్డర్డు ఇచ్చినప్పటికీ కొన్ని రోజుల పాటు వెయిటింగ్లో పెట్టి స్టాకు లేదన్న నెపంతో రూ. లక్షలు వసూలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో రెమ్డిసివిర్ డ్రగ్ వాస్తవ ధర రూ. 5,500 కాగా దానిని కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్లో రోగుల అవసరాన్ని బట్టి రూ. 30 వేల నుంచి 40 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే, కోరోనా రోగులకు అవసరమైన మరో ప్రాణాంతక ఔషధం టోసిలిటుమాట్ వాస్తవ ధర రూ. 40 వేలు కాగా దీనిని బ్లాక్ మార్కెట్లో రూ. 80 వేల నుంచి 1.5 లక్షల వరకూ విక్రయిస్తుండటం గమనార్హం. అయితే, ప్రైవేటు మందుల విక్రేతలపై ప్రభుత్వం ఎలాంటి నిఘా ఉంచకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల సంఖ్యలో ఔషధ విక్రయ దుకాణాలు ఉండగా, వాటిలో కొన్ని మాత్రమే ప్రతీ రోజూ భారీ సంఖ్యలో కొరోనా రోగులకు అవసరమైన మందులను విక్రయిస్తున్నాయి. ఈ ఔషధ దుకాణాల యజమానులతో పాటు డీలర్లకు ఉన్న పలుకుబడి ఉన్న కారణంగా కొరోనా రోగులకు అవసరమైన మందులు వారి ఇష్టం వచ్చిన రేట్లకు విక్రయించుకునే వీలు కలుగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, కొరోనా రోగులకు అవసరమైన ఔషధాలను కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండటంపై డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆప్ ఇండియా (డీజీసిఐ) తీవ్రంగా పరిగణించింది. తక్షణమే ఈ అంశంపై నివేదిక సమర్పించాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. బ్లాక్ మార్కెట్ దందాపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి అక్రమార్కులను కట్టడి చేయాలని స్పష్టం చేసింది.