Take a fresh look at your lifestyle.

కొరోనా సామూహిక వ్యాప్తి

  • వచ్చే నాలుగైదు వారాలు పరిస్థితి సంక్లిష్టమే
  • ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాస్‌
  • ‌కొరోనా లక్షణాలుంటే తేలిగ్గా తీసుకోవద్దు : డీఎంఈ డా.రమేశ్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో కొరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్‌) ‌దశ ప్రారంభమైందని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాసరావు చెప్పారు. వచ్చే నాలుగైదు వారాల పాటు పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం కోఠిలోని కొరోనా కంట్రోల్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌లో ఆయన వైద్య విద్య సంచాలకుడు డా.రమేశ్‌ ‌రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ ‌నగరంతో పాటు రంగారెడ్డి,మేడ్చల్‌ ‌వంటి సమీప జిల్లాలలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలలో వైరస్‌ ‌విజృంభిస్తున్నదని చెప్పారు. రాబోయే వారాల్లో స్వాబ్‌ ‌నమూనాలను 20000కు, ఆ తరువాత రోజుకు 25000కు పెంచుతామని వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేని వారు సైతం ఆందోళనతో అనవరసరంగా పరీక్షల కోసం పీహెచ్‌సిలకు వెళుతున్నారనీ, ఇది నిజంగా వైరస్‌ ‌సోకిన రోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. కొరోనా వైరస్‌ ‌లక్షణాలతో బాధపడుతున్న వారు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను సందర్శించి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఉందనీ, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది కూడా చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారనీ, కొరోనా పేషెంట్లకు రాత్రింబవళ్లు వైద్య చికిత్సలు అందించడంలో నిమగ్నమయ్యారని కొనియాడారు.

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తుందన్న కారణంతో ఆందోళన చెంది ఎవరూ పరీక్షలు చేయించుకోవద్దని సూచించారు.  దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరస్‌ ‌లక్షణాలు ఉన్న వ్యక్తులు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొరోనా విధుల్లో చాలా విభాగాలు నిమగ్నమై ఉన్నాయనీ, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొరోనా మరణాలు 0.88 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మరణిస్తున్న వారిలో కూడా వయోధికులు, గుండె, కిడ్నీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు మాత్రమే ఎక్కువ శాతం ఉన్నారని వివరించారు. ప్రస్తుతం కొరోనా సోకిన వారిలో 70 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్య చికిత్సలు పొందుతూ కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ 10 లక్షల జనాభాలో 8, 320 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు.    వైద్య విద్య సంచాలకుడు డా.రమేశ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ పూర్తి వాస్తవాలతో కొరోనా బులెటిన్‌ను విడుదల చేస్తున్నామన్నారు. వైరస్‌ ‌లక్షణాలు కనిపించిన వారందరూ హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌కు రావాలని అనుకోవద్దనీ, జిల్లా కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌లో కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు.

వైద్యారోగ్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు వెయ్యిమందికి పైగా కొరోనా బారిన పడినప్పటికీ భయపడకుండా వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగున్నర నెలలుగా కొరోనా బాధితుల కోసం వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారనీ, జ్వరం, దగ్గు వస్తే తేలికగా తీసుకోవద్దనీ, తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొరోనా భయంతో ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లి లక్షల రూపాయలు నష్ట పోవొద్దనీ, సీజనల్‌గా వచ్చే వ్యాధులను చూసి కొరోనా అని భయపడొద్దని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్‌ ‌పాత భవనాన్ని ఖాళీ చేయిస్తున్నామనీ, పాత భవనం కూల్చి వేసి కొత్త భవనం నిర్మాణంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. హాస్పిటల్‌ ఆవరణలో మ్యాన్‌హోల్‌ ‌పొంగడం వల్లనే ఇటీవల హాస్పిటల్‌లోని వర్షపు నీరు ప్రవేశించిందని వెల్లడించారు. కొరోనా చికిత్స కోసం సీఎం కేసీఆర్‌ ‌రూ. 100 కోట్లు మంజూరు చేశారనీ, వైద్య అధికారులు, సిబ్బందికి ఎలాంటి నిధుల కొరత లేదని ఈ సందర్భంగా రమేశ్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply