Take a fresh look at your lifestyle.

‌ట్రంప్‌ ‌నిర్లక్ష్య ధోరణి…

వైట్‌ ‌హౌస్‌లో కొరోనా కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌నిర్లక్ష్యం వల్ల వైట్‌ ‌హౌస్‌లో 19 మందికి కొరోనా సోకింది. కొరోనా గురించి ఆయన మొదటి నుంచి నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తుండటం వల్లనే దేశంలో కేసులు పెరిగాయని వైద్య రంగానికి చెందిన నిపుణులు ఇప్పటికే ఆరోపించారు. తాజాగా అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కొరోనా సోకిన తర్వాత తగిన జాగ్రత్తలను తీసుకోకపోవడం వల్లనే వైట్‌ ‌హౌస్‌లో అంతమందికి వైరస్‌ ‌సోకిందని వ్యాఖ్యానించారు.  సైనిక హాస్పిటల్‌లో చికిత్స పూర్తి అయిందని ప్రకటించి ట్రంప్‌ ఆ ‌హాస్పిటల్‌ ఆవరణలో అభిమానులను కలుసుకోవడానికి బయటకు వచ్చి కారులో పలు సార్లు తిరిగారు. ఆ సమయంలో కూడా పలువురికి కొరోనా సోకినట్టు సమాచారం. అగ్రరాజ్యాధిపతి వైరస్‌ ‌సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి  ప్రజలను హెచ్చరించాల్సింది పోయి, తానే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత ప్రమాదకరమో  ఇప్పుడు రుజువైంది. ట్రంప్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వైద్యం చేసిన డేవిడ్‌ ‌ఫిలిప్స్ ‌కూడా ఇదే మాదిరిగా విమర్శించారు.

ట్రంప్‌ ‌కొరోనా జాగ్రత్తల కన్నా వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్షపదవికి జరిగే ఎన్నికలకు ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన హాస్పిటల్‌ ‌నుంచి వైట్‌ ‌హౌస్‌కు వచ్చినప్పుడు కూడా అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు.  ఎన్నికల సీజన్‌ ‌కావడం వల్ల రాజకీయ నాయకులు ఎక్కడ పడితే అక్కడ అభిమానుల అభివాదాలను స్వీకరిస్తూ చేయి ఊపడం సహజమే కానీ, ట్రంప్‌ ‌వ్యవహరిస్తున్న తీరు మాత్రం అతిగా  ఉందన్న విమర్శలు ఇప్పటికే వచ్చాయి. కొరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యత అంటూ పలుమార్లు ఆరోపించడం వల్ల ట్రంప్‌కు కొరోనా వచ్చిందన్న వార్తల  పట్ల  చైనా నుంచి వెలువడే గోల్డెన్‌ ‌టైమ్స్ ‌పత్రిక సంపాదకుడు తగిన శాస్తి జరిగిందంటూ  ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడం  ఆయన పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం ట్రంప్‌తో డిబేట్‌ ‌జరిపిన ఆయన ప్రత్యర్థి, డెమోక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్థి బైడేన్‌ ‌కూడా ట్రంప్‌ ‌నిర్లక్ష్యం వల్లే కొరోనా వ్యాప్తి ఎక్కువైందని విమర్శించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తొందరపాటు వ్యాఖ్యలు చేయడం, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా ఇప్పటికే  చులకన అయింది. అగ్రరాజ్యాధినేత వ్యవహరించాల్సిన తీరులో ఆయన నడుచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ట్రంప్‌ అధికారంలోకి రాగానే వాణిజ్యపరంగా చైనాపై చేసిన విమర్శలు, ఆరోపణలతో చైనా కుతకుత ఉడుకుతోంది. అయితే, చైనా కొరోనా వైరస్‌ను ముందుగా ప్రపంచానికి తెలియజేయకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 41 దేశాలు ఇప్పుడు విమర్శిస్తున్న మాట నిజమే.

ఈ విషయంలో ముందుగా నోరు  తెరిచింది ట్రంప్‌. అం‌దుకు ఆయనను  అభినందించాల్సిందే. అయితే, అగ్రరాజ్యాధినేత కావడం వల్ల ఆచితూచి మాట్లాడాలి. కొరోనా అభూతకల్పన అని నమ్మే వారికి ట్రంప్‌ ‌వల్ల వైట్‌ ‌హౌస్‌లో పలువురు సిబ్బంది కొరోనా బారిన పడటం ప్రత్యక్ష నిదర్శనమని ఆంటోనీ ఫౌచీ అన్నారు. కొరోనా చికిత్స కోసం హాస్పిటల్‌లో ఉండాల్సి రావడం వల్ల ట్రంప్‌కి ఇబ్బంది కలగడం సహజమే. అందునా  తిరిగి పోటీ చేస్తున్నందున ఆయన పదవిని నిలబెట్టుకోవడంపైనే దృష్టి ఉండటం కూడా సహజమే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మనుగడను సవాల్‌ ‌చేస్తున్న కొరోనా నియంత్రణకు అన్ని దేశాల కన్నా ముందుగా  చొరవ తీసుకుని వ్యాక్సిన్‌ ‌తయారీ నుంచి ఇతర నివారణోపాయాలపై అంతర్జాతీయ సదస్సులు, నిపుణుల  సమావేశాలు  నిర్వహించాల్సిన అమెరికా కేవలం తమ దేశంలో పరిస్థితిపైనే దృష్టి సారిస్తే ఇక అగ్రరాజ్యమని ఎలా అనిపించుకుంటుందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.   ట్రంప్‌ ‌చైనాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధపడి సాధించిందేమీ లేదు. అసలు అందువల్ల చైనా వాణిజ్య పరంగా నష్టపోలేదు. కొరోనా విషయంలోనే  చైనాతో వాణిజ్యాన్ని  ప్రపంచ దేశాలు తగ్గించుకున్నాయి.

కొరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ ‌రూపకల్పనలో తామే ముందున్నామని చెప్పుకునే చైనా ఆ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించి ఉంటే చైనా పట్ల ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 150 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమితో కలిసి పని చేయడానికి ట్రంప్‌  ‌నిరాకరించారు. అలా కలిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా తమను తాము కట్టడి చేసుకోలేమని ట్రంప్‌ ‌వ్యాఖ్యానించారు.  ఊరందరిదీ ఒక దారి అనే సామెత చందంగా ట్రంప్‌ ‌వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. అసలు ఈ కూటమిని ఏర్పాటు చేసి, దానికి సారథ్యం వహించాల్సిన అమెరికా అధినేతే ఒంటెత్తు పోకడలకు పోతుంటే  ఇక చిన్న, వర్దమాన దేశాల పరిస్థితి ఏమిటి? అందుకే,  ట్రంప్‌తో మరోసారి డిబేట్‌కు తాను హాజరు కానని డెమోక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ ‌ప్రకటించారు. కొన్నాళ్ళ పాటు అధ్యక్ష పదవిని తమ పార్టీ నాయకుడైన, ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్‌కు అప్పగించేందుకు ట్రంప్‌ ‌నిరాకరించారు. తానే ప్రచారం చేసుకోవాలనీ, ప్రజలకు నిరంతరం సన్నిహితంగా ఉండాలన్న ఆయన ఆకాంక్ష వల్లనే వైట్‌ ‌హౌస్‌లో కొరోనా వ్యాప్తి జరుగుతోందని అమెరికన్లే విమర్శిస్తున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో తమ దారి తమదేననీ, ప్రపంచ దేశాలతో కలిసి నడవబోమని ఆయన స్పష్టంగానే ప్రకటించారు. కొరోనా మహమ్మారిని ఓడించాలన్న  లక్ష్యంతో అంతా పని చేస్తుంటే ట్రంప్‌ అనుసరిస్తున్న ఈ ధోరణి వల్ల కొరోనాపై పోరాట స్ఫూర్తి నీరుగారుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అగ్రరాజ్యాధినేతకు ఇది తగదని అమెరికన్లే విమర్శిస్తున్నారు.

Leave a Reply