Take a fresh look at your lifestyle.

సుప్రీమ్‌ ‌కోర్టులో తిష్ట వేసిన కొరోనా..

  • 50 శాతం స్టాఫ్‌కు పాజిటివ్‌..
  • ‌కొంత కాలం వర్చువల్‌ ‌హియరింగ్స్
  • ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 

50 ‌శాతం సిబ్బంది కొరోనా వైరస్‌ ‌బారిన పడిన తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానం వర్చువల్‌ ‌హియరింగ్స్ ‌తిరిగి ప్రారంభించాలని సోమవారం నిర్ణయించుకుంది. సుప్రీమ్‌కోర్టులో చాలా మంది సిబ్బంది కోవిడ్‌-19 ‌బారిన పడ్డారని, అందువల్ల సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తులు సోమవారం తమ నివాసాల నుండి విచారణలు నిర్వహిస్తారని సుప్రీమ్‌కోర్టు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థలు రిపోర్ట్ ‌చేసాయి. మహమ్మారి సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా కోర్టులు ఎలా పనిచేయాలనే దానిపై అత్యున్నత న్యాయస్థానం త్వరలో ఆదేశాలు జారీ చేస్తుందని తెలుస్తున్నది. సోమవారం ఉదయం 10.30 గంటలకు కూర్చోవాల్సిన కోర్టు అన్ని బెంచీలు ఉదయం 11.30 గంటలకు కూర్చున్నాయి. సుప్రీమ్‌కోర్టులో ఉదయం 11 గంటలకు కూర్చోవాల్సిన వారు మధ్యాహ్నం 12 గంటలకు కూర్చున్నారని అదనపు రిజిస్ట్రార్‌ ‌నోటీసు జారీ చేసారు. భారతదేశంలో ప్రబలుతున్న కోవిడ్‌ -19 ‌సంక్షోభం సుప్రీమ్‌ ‌కోర్టును పెద్ద ఎత్తున తాకింది. అయితే కోర్టు మాత్రం తన పనితీరు ఏ విధంగానూ ప్రభావితం కాదని చెబుతున్నది. విచారణలు ఇకపై న్యాయమూర్తుల ఇంటి నుండి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా జరుగుతాయని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోర్టు గదులతో సహా మొత్తం కోర్టు ఆవరణ ఇప్పుడు శానిటైజషన్‌లో ఉందని కోర్టు వర్గాలు తెలుపుతున్నాయి. సోమవారం వివిధ బెంచీలు వారి షెడ్యూల్‌ ‌సమయం కంటే ఒక గంట ఆలస్యంగా కూర్చున్నాయి. ఇందులో ఆందోళన చెందడానికి ఏమీ లేదని అధికారులు హామీ ఇస్తున్నారు. శనివారం జరిగిన కోవిడ్‌ -19 ‌పరీక్షలో 90 మంది సుప్రీమ్‌ ‌కోర్టు ఉద్యోగులలో 44 మంది కోర్టు ఉద్యోగులకి కొరోనా పాజిటివ్‌ అని తేలిందని దీనితో కొంతమంది న్యాయమూర్తులలో భయాందోళనలు నెలకొన్నాయని తెలుస్తున్నది. ‘‘మహమ్మారి వల్ల జ్యుడిషియల్‌ ‌పనులు ప్రభావితం కావు’’ అని జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ఎన్డిటివికి చెప్పారు. ‘‘సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయ సంబంధ పనులకు తగిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది’’ అని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న 1,600 వీడియో-కాన్ఫరెన్సింగ్‌ ‌లింకుల గురించి అయన ప్రస్తావించారు. ‘‘పదహారు బెంచీలు పనిచేస్తున్నాయి. అంతకుముందు, భారీ మొత్తంలో ఫైళ్ళను భౌతికంగా ఉపయోగించారు, ఇప్పుడు, ప్రతిదీ ఎలక్ట్రానిక్‌ ‌పద్ధతిలో లభిస్తుంది’’ అని సుప్రీమ్‌ ‌కోర్టు ఇ-కమిటీ ఛైర్మన్‌ ‌న్యాయమూర్తి తెలిపారు. గత వారంలో సుమారు 10 లక్షల కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో భారతదేశం మహమ్మారి రెండవ వేవ్‌ను ఎదుర్కుంటున్నది. సోమవారం  వరుసగా ఆరో రోజు 1,68,912 కొత్త కేసులతో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. సోమవారం ఉదయం ప్రచురించిన తాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 904 మంది వరకు కోవిడ్‌ ‌సంబంధిత సమస్యలతో మరణించారు.

Leave a Reply