Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌ప్రజల్లో వణుకు పుట్టిస్తున్న కొరోనా

  • నగరంపై ప్రభావం చూపని నియంత్రణ చర్యలు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతీ రోజూ సమీక్షలు

‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరాన్ని కొరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యలో అత్యధిక శాతం నగరానికి చెందినవే ఉండటం నగర ప్రజలను కలవరానికి గురి చేస్తున్నది. వైరస్‌ ‌నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అంతగా ప్రభావం చూపకపోవడంతో స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌జీహెచ్‌ఎం‌సిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జీహెచ్‌ఎం‌సిని 17 యూనిట్లుగా విభజించి ప్రతీ యూనిట్‌కు ఒక సీనియర్‌ ‌వైద్యాధికారితో పాటు పోలీస్‌, ‌రెవెన్యూ మున్సిపల్‌ ‌శాఖల అధికారులను ప్రత్యేకంగా నియమించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా మంగళవారం నుంచి మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో పాటు సీనియర్‌ ‌పోలీసు, మున్సిపల్‌ అధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులతో పాటు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

సమీక్షలో తీసుకున్న నిర్ణయాల మేరకు చర్యలు అమలు చేయాలనీ, సాధ్యమైనంత త్వరగా రాజధానిని కరోనా ఫ్రీ నగరంగా ప్రకటించాలని ఆదేశించారు. సీఎం సీరియస్‌ ‌కావడంతో వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖతో పాటు మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాజధాని పరిధిలోని సైబరాబాద్‌లో 39 కంటైన్మెంట్‌ ‌జోన్లను గుర్తించారు. వీటిలో అల్వాల్‌, ‌తుర్కపల్లి, బాలానగర్‌, ‌శంషాబాద్‌, అస్మక్‌పేట్‌, ‌జీడిమెట్ల, అపూర్వకాలనీ, ధర్మారెడ్డికాలనీ, కళావతినగర్‌, ‌గచ్చిబౌలి, అయ్యప్పసొసైటీ, ఇజ్జత్‌నగర్‌, ‌హఫీజ్‌పేట ఉన్నాయి. అధికారులు ఈ జోన్లకు పూర్తిగా రాకపోకలను నిషేధించారు. ఇక్కడ నివసించే వారిని బయటికి, బయటి ప్రాంతాలకు చెందిన వారిని లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులలో సగం కంటే ఎక్కవగానే అంటే దాదాపు 270 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతంలో రోజురోజుకూ పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్మెంట్‌ ‌జోన్ల సంఖ్యను ముందుగా 15 నుంచి 123 కు పెంచారు. అయినప్పటికీ ఫలితం రాకపోపడంతో ఇప్పుడు ఆ సంఖ్యను 126కు పెంచారు.

అలాగే, దిల్లీ మర్కజ్‌ ‌ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ద్వారానే నగరంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరగడంతో పాటు వారి ద్వారా మరికొంతమందికి ఈ వైరస్‌ ‌సంక్రమిస్తుండటంతో ప్రభుత్వం నగరంలో హాట్‌స్పాట్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో హాట్‌స్పాట్‌లో నలుగురు సభ్యులతో కూడిన అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా తేలి దిశ్జార్జి చేసి ఇంటికి పంపిన వారిని తిరిగి క్షుణ్నంగా పరీక్షలు నిర్శహిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం డ్సీఈపి నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఇంటికి వెళ్లడం ఆ తరువాత మరోమారు నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటికప్పుడు తిరిగి ఆయనను చెస్ట్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటికి వెళ్లిన తరువాత కూడా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ టెస్టులలో సైతం నెగెటివ్‌గా వచ్చిన వారిన మాక్రమే కొరోనా నుంచి విముక్తి పొందినట్లుగా ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎం‌సీ ప్రత్యేక బృందాలు మంగళవారం అన్ని హాట్‌స్పాట్‌ ‌కేంద్రాలలో పర్యటించిన దాదాపు 190 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ ‌సేకరించాయి.

Leave a Reply