- అప్రమత్తంగా ఉండాలి..రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
- కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం
- స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ సెక్రటరీ సూచన
రోజువారీ కేసులు ఒకేసారిగా పెరగడంతోపాటు కొరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కోవిడ్ మార్గదర్శకాలను మరో నెల రోజుల పాటు పొడగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, రానున్న పండుగ సీజన్లో పెద్ద సమూహాలతో సమావేశాలు జరుగకుండా చూసుకోవాలని కొత్త ఉత్తర్వుల్లో తెలిపారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసులు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే, జాతీయ స్థాయిలో మాత్రం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు, వారి జిల్లాల్లో కేసుల పెరుగుదలను సమర్థంగా అదుపు చేయడానికి, వ్యాప్తిని అరికట్టడానికి అనుకూలమైన నియంత్రణ చర్యలను తీసుకోవాలని హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా తన లేఖలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు సూచించారు.
రానున్న రోజుల్లో ఎక్కువగా పండుగలు ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అవసరమైనపక్షంలో ఆంక్షలు కూడా విధించి కొరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే మహారాష్ట్రలో పండుగల సందర్భంగా కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్ల వల్ల కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేసింది.
మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కొరోనా కేసుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పండుగల సందర్భంగా వైరస్ ప్రబలకుండా మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ మేర కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్ర అధికారులకు లేఖ రాశారు. కొరోనా వ్యాప్తి చెందకుండా ఆగస్టు 29న జరగనున్న దహీహండీ వేడుకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. మహారాష్ట్ర సర్కారు దహీహండీ పండుగపై నిషేధాన్ని ఎత్తివేసి, ఆంక్షలతో పండుగ జరుపుకునేందుకు అనుమతించాలని బీజేపీ అధికార ప్రతినిధి రాం కదమ్ డిమాండ్ చేశారు. దేశీయ విమాన ప్రయాణం కోసం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ముందు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం సూచించింది. టెస్టు, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, ఆంక్షల అమలుతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ మహారాష్ట్ర సర్కారుకు సూచించింది.