- 24 గంటల్లో 83,883 మందికి పాజిటివ్
- ఐదు రాష్ట్రాల్లోనే తీవ్రమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
- రాష్ట్రంలో కొత్తగా 2,817 కేసులు నమోదు
- అసింప్టమాటిక్ వారితోనే సమస్యలంటున్న అధ్యయనాలు
భారత్‌లో కొరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లోనే అత్యధికంగా 11.70లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా 83,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో గురువారం నాటికి దేశంలో కొరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్సపొందుతున్నారు. బుధవారం మరో 68వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కొరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది. కోవిడ్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 1043 మంది కొరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య 67,376కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.
ఐదు రాష్ట్రాల్లోనే తీవ్రమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
దేశంలోని ఐదు రాష్ట్రాల్లోనే కొరోనా తీవ్ర అధికంగా ఉందని వెల్లడించింది కేంద్ర ఆరోడ్య శాఖ. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 70 శాతం మరణాలు నమోదైనట్టు ఆ శాఖ కార్యదర్శి తెలిపారు. ఏపీ, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో అత్యధిక మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,72,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 4.5 కోట్లు దాటేసింది. అత్యధిక కరోనా పరీక్షల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 30వ తేదీ వరకు రోజుకు పదుల సంఖ్యలో నిర్వహించిన పరీక్షలు.. ఏడు నెలల్లోనే రోజుకు 11లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇప్పుడు రోజూవారి
నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా దేశంలో పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గుతుందడడంతో పాటు మరణాల రేటు కూడా తగ్గడం సానుకూలాంశమని కేంద్రవైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 2817 కేసులు నమోదు
తెలంగాణలో కూడా కొరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 2,817 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. మంగళవారం 2611 మంది కోవిడ్ రోగులు కోలుకుని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,00,013కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,537. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కొరోనా బాధితుల రికవరీ రేటు 77.09 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.9 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.75 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,711 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 15,42,978కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
అసింప్టమాటిక్ వారితోనే సమస్యలంటున్న అధ్యయనాలు
కొరోనా విషయంలో రోజు రోజుకు కొత్త విషయాలు బైటకొస్తున్నాయి. అసింప్టమాటిక్ వారిలో ఇప్పటి వరకు వైరల్ లోడ్ ఉండదని అనుకున్నారు. అయితే వారిలో కూడా లోడ్ ఎక్కువగా ఉంటుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. వాళ్ళే కారియర్లు అవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అసింప్టమాటిక్ అనేది చాలా ప్రమాదమని అన్నారు. వారిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ చేరి ఇతరులకు వ్యాప్తి చెందుతోందని అన్నారు. వారిలో లక్షణాలు కనిపించకపోవడంతో నిర్లక్ష్యం పాళ్లు కూడా ఎక్కువ ఉంటుందన్నారు. మాస్క్, సామాజిక దూరం, శానిటైజ్ ఉపయోగించకపోతే ఒక వ్యక్తి నుంచి ఆరుగురికి సోకే అవకాశముందన్నారు. అసింప్టమాటిక్ ఉన్న వ్యక్తి మాట్లాడితే ఐదడుగుల దూరం వరకు వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. వారికి జలుబు, దగ్గు, తుమ్ములు ఉండవని డాక్టర్లు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వారు కూడా వ్యాధి తీవ్రం అయ్యేవరకు తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. దీంతో తాము క్యారియర్స్ అన్న సంగతి గుర్తించడం లేదన్నారు.