భక్తులను వెనక్కి పంపుతున్న అధికారులు
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల పాటు మూసివేసారు. దీంతో భక్తులను వెనక్కి పంపుతున్నారు. అక్కడికి రాకుండా కట్టుదిట్టం చేశారు. భక్తులు ఎవరు కూడా రావొద్దని, జాతర ముగిసిందని అన్నారు. ఆదివారం ఇక్కడి ఎండోమెంట్ కార్యాలయంలో ఆలయ ఈఓ రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వి•డియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
మేడారం మినీ జాతరలో విధులు నిర్వహించిన ఇద్దరు ఎండోమెంట్ ద్యోగులకు కొరోనా పాజిటివ్ రావడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 21 రోజుల పాటు అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కొరోనా దృష్ట్యా భక్తులు మేడారానికి రావొద్దని కోరారు.
బుధవారం తిరుగువారం పండుగ, పూజా కార్యక్రమాలను సమ్మక్క సారలమ్మ పూజారులు అంతర్గతంగా నిర్వహించుకుంటారన్నారు. కాగా, ఆదివారం భారీగా తరలివొచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కు లు చెల్లించుకున్నారు.