- ప్రయాణాలతోనే ఎక్కువగా ప్రమాదం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
కొరోనా మహమ్మారి గ్రామాల్లో దూసుకుపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులసంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో ప్రజలు పనుల కోసం బయటకు రావడంతో కేసులు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నాయి. ముందుగానే అంచనా వేసిన విధంగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోతున్నాయి. జనం కూడా ఏ మాత్రం భయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. రాజధాని వెళ్లివచ్చిన చాలా మందికి కొరోనా పాజిటివ్‌గానే నిర్దారణ అవుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు, జిల్లాలకు ఆర్టిసి బస్సులు ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో కొరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది.
నిత్యం రాజధానికి రాకపోకలు కొనసాగడంతోనే వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు ఇప్పటికే నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వివిధ రకాల పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చిన వారితో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సాధారణ పనుల నిమిత్తం ప్రయాణాలు చేయరాదంటూ చెబుతున్నా పట్టింపే లేకుండా పోతోంది. సాధ్యమైనంత వరకు జిల్లాలకు వచ్చిపోయే రాకపోకలను నియంత్రించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్నాళ్లపాటు ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రమాదమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో రోజురోజుకూ పెరిగిపోతున్న కొరోనా కేసులతో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. వ్యాధి నివారణ కోసం లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే అనుమానిత వ్యక్తులు విచ్చలవిడిగా తిరగడంతో మరెన్నో కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్తీల నుంచి వచ్చిన కొరోనా పాజిటివ్ రోగులను ఇంకా గుర్తించక పోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంత ప్రమాదకరంగా మారినా ఎక్కడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. కొందరైతే కనీసం మాస్కులు ధరించకుండానే బయట తిరగడం కనిపిస్తోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జిల్లా అధికారులతో కలిసి నేతలు హడావిడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమవు తోంది. రాజకీయ కార్యకలాపాల కారణంగా గ్రామాల్లో విస్తరిస్తోందన్న వాదనలు ఉన్నాయి. కొత్త కేసులన్నీ ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్ వెళ్లి వచ్చిన వారికి వైరస్ సోకగా ప్రస్తుతం వారికి కాంటాక్ట్ అయిన కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవుతోంది. సామాజిక వ్యాప్తి అంతగా లేకున్నా నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దశలో మాస్కులు ధరించి తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కూడా కొరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులను ధరించాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. కొరోనాకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే మంచిదని, వైరస్ కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అంటున్నారు.