Take a fresh look at your lifestyle.

విద్యారంగంపై కొరోనా కాటు

కొరోనా ప్రభావం అన్నిరంగాపై పడినట్లే విద్యారంగంపైన కూడా చూపిస్తున్నది. వైరస్‌ ‌విజృంభిస్తున్న కారణంగా నేటికి నలభై రోజులుగా ప్రాథమిక స్థాయి మొదలు యూనివర్శిటీల వరకు మూతపడ్డాయి. ఇంత సుదీర్ఘకాలం విద్యార్థులు విద్యకు దూరమవడం బహుషా ఇదే మొదటిసారి అయుంటుంది. విద్యా సంవత్సరం చివరి అంకంలో కొరోనా ముంచుకురావడంతో విద్యాసంస్థలను తప్పనిసరిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ విషయానికొస్తే పదవతరగతి పరీక్షలు జరుగుతున్న క్రమంలో మధ్యలోనే పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటికే మూడు సబ్జెక్టు పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా పరీక్షలను కూడా విద్యాశాఖ కొనసాగించాలనుకున్నప్పటికీ కొరోనా ముంచుకురావడంతో ఆ పరీక్షలు వాయిదావేయాల్సి వచ్చింది. మే ఏడవతేదీ తర్వాత మిగతా పరీక్షలను నిర్వహిస్తారా, అలా అయితే ఎన్నిరోజుల్లో చేపడుతారన్న విషయంలో ఇంకా స్పష్టతలేదు. వాస్తవంగా లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేసినా అసలు విద్యాలయాలను తెరుస్తారా? మూకుమ్మడిగా విద్యార్థులు బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయంలో విద్యారంగ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సామాజిక దూరాన్ని మరికొద్దిరోజులు తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నప్పుడు నూతన విద్యాసంవత్సరాన్ని ఎలా కొనసాగించాలన్న విషయంలో కూడా పలురకాల అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇంటర్‌ ‌పరీక్షలు నిర్వహిస్తేగాని ఉన్నత విద్యలకు, పోటీపరీక్షలకు, వెళ్ళేందుకు విద్యార్థులకు అవకాశముండదు. ఇంటర్‌ ‌పరీక్షలు నిర్వహించడమన్నది ఒక ఎత్తు అయితే, వాటి ఫలితాలను ప్రకటించేందుకు పట్టే సమయంపై తర్జనబర్జనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతికి పంపించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుత విద్యాసంవత్సరం కొనసాగింపు, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాబోధనలో ఎదురయ్యే సమస్యలపై ఇప్పుడు ప్రత్యేక దృష్టిని సారించాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే ప్రణాళికలను రూపొందుంచుకోగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకులు తగిన మైలిక సదుపాయాలు లేక అయోమయమవుతున్నారు. గతంలోలాగానే విద్యాబోధనను కొనసాగిస్తే సిలబస్‌ను పూర్తిచేయడం సాధ్యపడే అవకాశాలులేవు. అందుకు స్టడీ అవర్స్‌ను పెంచితేనే తప్ప ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేసే పరిస్థితి లేదు. సామాజిక దూరాన్ని పాటించాలంటే ఇప్పుడున్న క్లాస్‌రూమ్‌లు సరిపోవు. అప్పుడు ఒకేసారి నలభై మంది విద్యార్థులకు పాఠాలు చెప్పడం సాధ్యపడదు.

అందుకు విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించి షిఫ్ట్ ‌పద్ధతిలో తరగతులను నిర్వహించడమన్నది ఒక పద్ధతి కాగా, అందుకు అధ్యాపకుల సంఖ్య కూడా పెరుగాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేదా ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు అందిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమన్నది మరో పద్ధతి. ప్రభుత్వ పాఠశాలల్లో అదిసాధ్యమవుతుందా. ఆ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందా అన్నది ఒక అంశం కాగా, దాన్ని వినియోగించుకునే స్థోమతలో విద్యార్థులున్నారా అన్నది మరో ప్రశ్నగా ఉత్పన్నం కానుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపి ప్రభుత్వం దూరదర్శన్‌ను వాడుకోవడం ద్వారా, యూట్యూబ్‌ల ద్వారా విద్యాబోధనకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించుకుంటోంది. విద్యార్థులు ఇంటివద్దే ఉండి సప్తగిరి ఛానల్‌ద్వారా ఉదయం, సాయంత్రం ప్రతీరోజు రెండు గంటలపాటు విద్యార్థులు పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నది. అయితే పాఠాలను వినాల్సిన పద్ధతి, పరీక్షలకు సిద్దంకావాల్సిన విధానాన్ని విద్యామృతం అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలియజేసే ప్రణాళికను రూపొందించింది. అలాగే అందుబాటులో ఉండే ఇతర మీడియా వేదికల ద్వారా, ఆన్‌లైన్‌, ‌యూట్యూబ్‌ల ద్వారా విద్యాబోధన ఏర్పాట్లను చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలానే ఆన్‌లైన్‌ ‌ద్వారా విద్యార్థులు ఇంటివద్దనే ఉండి పాఠాలు నేర్చుకునే విధంగా ప్రణాళికను రూపొందిస్తే వైరస్‌ ‌బారినుండి విద్యార్థులను రక్షించుకోవడంతోపాటు, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యాబోధనే కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలను కూడా ఎలా రాయాలన్న అంశంపైన కూడా ప్రభుత్వం విద్యారంగం, సాఫ్ట్‌వేర్‌ ‌నిపుణుల సలహాలను తీసుకోవాల్సిన అవసరముందంటున్నారు. గ్రాడ్యుయేట్‌, ‌పోస్టుగ్రాడ్యుయేట్‌ ‌విద్యార్థులైతే కొంతవరకు ఆన్‌లైన్‌ ‌పాఠాలను గ్రహించగలుగుతారు. కాని, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థుల పరిస్థితేమిటన్నదే ప్రశ్నగా మారుతున్నది. లాక్‌డౌన్‌ ‌కారణంగా అన్ని తరగతుల విద్యార్థులు ఇప్పటికే సోషల్‌మీడియాలో గంటలకొద్ది సమయాన్ని వృథా చేస్తున్నారు. వారికిప్పుడిది వ్యసనంగా మారింది. మన విద్యాశాఖతోపాటు, తల్లిదండ్రులు కూడా లాక్‌డౌన్‌ను ప్రిపరేషన్‌ ‌హాలిడేస్‌గా గుర్తించి జాగ్రత్తగా చదువుకోవాలని ఎంతచెప్పినా విద్యార్థులు టివీలకు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్న దశలో ఆన్‌లైన్‌ ‌పాఠాలతో దానికి చెక్‌పెట్టే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy