Take a fresh look at your lifestyle.

కరోనా ఎఫెక్ట్ ఆలయంలోనే.. శ్రీసీతారామ కల్యాణం

  • ఈ నెల ఆఖరులో ప్రభుత్వం నిర్ణయం 

యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి వేదపండితులు తేదీలు ఖరారు చేసారు. ఏప్రిల్‌ 2‌వ తేదీన శ్రీస్వామివారి కళ్యాణం, 3వ తేదీన మహాపట్టాభిషేకం నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంతలోనే కరోనా ప్రబావం దేశవ్యాప్తంగా అనేక మందిని బలి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం కూడ కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. దీని కారణంగా ఏప్రిల్‌ 2‌వ తేదీన జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేలాదిగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదం దృష్టిలో ఉంచుకుని ఈసారి శ్రీసీతారాముల కళ్యాణాన్ని మిధిలా స్టేడియంలో ఉన్న మండపంలో కాకుండా ఆలయంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం ఈనె) ఆఖరుకల్లా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసీతారాముల కళ్యాణం జరిగే ఒంటిమిట్ట వద్ద ఆలయంకు కరోనా ఎఫెక్ట్ ‌పడింది.

ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అక్కడ స్వామివారి కళ్యాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ప్రతీ ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తారు. తరువాత జరిగే మహాపట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్‌ ‌ప్రత్యేకంగా హాజరవుతున్నారు. వివిధ శాఖల మంత్రులు కూడ రావడం ఆనవాయితీ. ఈ ఏడాది స్వామివారి కళ్యాణం సమయం దగ్గరపడుతుండగా కరోనా ఎఫెక్ట్ ‌కూడ అంతేవేగంగా వ్యాప్తి చెందడంతో దీని ప్రభావం అన్నీ దేశాల్లో పడింది. ఈ ప్రభావాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గుర్తించి శ్రీసీతారాముల కళ్యాణాన్ని కళ్యాణ మండపంలో కాకుండా ఆలయంలోనే నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది అత్యంత వైభవంగా జరిగే కళ్యాణాన్ని ఈసారి భక్తులు టివిల్లోనే చూసితరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా ప్రభావంతో సినిమా హాల్స్, ‌స్కూల్స్, ‌మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు నిలిచోవద్దని చెప్తుంది. శ్రీసీతారాముల కళ్యాణం రోజు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందనే ఆలోచనతో కళ్యాణాన్ని ఆలయంలోనే ఉత్సవమూర్తులతో నిర్వహిస్తారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో కొంతమంది శ్రీసీతారాముల కళ్యాణాన్ని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీస్వామివారి కళ్యాణాన్ని రద్దు చేయటం జరుగదు. వేదపండితులు ఆలయంలోనైన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి తీరాల్సిన అవసరం ఉంది.

Leave a Reply