Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా.. విజృంభిస్తున్న కొరోనా

24 గంటల్లో 57117 మందికి పాజిటివ్‌ ..36 ‌వేలు దాటిన మరణాలు

దేశంలో కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్నది. వైరస్‌ ‌బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రతి రోజు రికార్డుస్థాయిలో పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 55 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా అంతకుమించి 57 వేలకుపైగా వైరస్‌ ‌బారినపడ్డారు. దీంతో దేశంలో కొరోనా కేసులు 17 లక్షలకు చేరువలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా శనివారం గణాంకాల ప్రకారం 24 గంటల్లో 57,117 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా, 764 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,95,988కి చేరగా, మరణాలు 36,511కు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ ‌కేసుల్లో 5,65,103 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మరో 10,94,374 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో కొరోనా రికవరీ రేటు 65 శాతానికి చేరుకున్నది. మరణాల్లో భారత్‌ ఇప్పటికే ఇరాన్‌ను దాటేసి, అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్‌, ‌బ్రిటన్‌, ‌మెక్సికో దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా శుక్రవారం 5,25,689 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ ‌ప్రకటించింది. అదేవిధంగా జూలై 31 వరకు 1,93,58,659 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

మరో పదేండ్ల వరకు కొరోనా ప్రభావం : డబ్ల్యుహెచ్‌ఓ

‌కొరోనా వైరస్‌ ‌ప్రభావం మరో పదేండ్ల పాటు ఉంటుందని వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌(‌డబ్ల్యూహెచ్‌ఓ) ‌సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్‌ ‌రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కారణంగా గత కొన్నాళ్ళుగా అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది ఉపాధి కూడా కోల్పోయారు. ఇప్పటికీ ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఏకంగా మరో పదేండ్ల పాటు ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధ్నామ్‌ ‌గ్యాబ్రియోసిస్‌  ‌హెచ్చరించారు. ఇటీవల కొరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ టీమ్‌ అత్యవసరంగా సమావేశమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాబ్రియోసిస్‌ ‌మాట్లాడుతూ కొరోనా మహమ్మారి ప్రభావం మరో పదేండ్ల పాటు ఉంటుందని, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలని, ఈ తరహా వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని, వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

error: Content is protected !!