రాష్ట్రంలో మరణాలు 0.7 శాతం మాత్రమే వైరస్ నివారణ చర్యలపై తప్పుడు ప్రచారం తగదు: రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు
సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కొరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. కోవిడ్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ..మాస్కులు ధరించాలని సూచించారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్‌ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ…కొరోనా
పరీక్షల సంఖ్య గతంలో కంటే పెంచామని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10.21 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రైవేటు దవాఖానాలు నిబంధనల మేరకే బిల్లులు వేయాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. మరికొన్ని ప్రైవేటు దవాఖానాలపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు. తెలంగాణలో కొరోనా మరణాల రేటు జాతీయస్థాయి రేటు కన్నా తక్కువగానే ఉందన్నారు. వైరస్ నివారణకు చర్యలు తీసుకోవట్లేదని తప్పుడు ప్రచారం చేస్తే బాధనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొరోనా మరణాలు 0.7 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిరోజు 40 వేల పరీక్షలు చేస్తున్నామని, మొత్తం పరీక్షల్లో 50 శాతం పరీక్షలు ఆగస్టు నెలలోనే జరిగాయని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్య సిబ్బంది కొరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తోందన్నారు. 2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది ఇప్పటివరకు కొరోనా బారిన పడ్డారని తెలిపారు. కొరోనాతో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకుంటామని, ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుందని పేర్కొన్నారు. ప్రయివేట్ దవాఖానాలపై వస్తున్న ఫిర్యాదులను విచారణ చేస్తున్నామని, ఇప్పటికీ ప్రతి రోజు 5 నుంచి 8 వస్తున్నాయని వెల్లడించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. 50 శాతం బెడ్ల అధీనంపై చర్చలు జరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఈ సీజన్లో చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ జ్వరాలు ప్రబలే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొరోనా, సీజనల్ జ్వరాల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని, ఎలాంటి లక్షణాలు ఉన్నా సపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు.