24 గంటలలో 1069 మంది మృతి
ఆగని వైరస్ విజృంభణ
దేశంలో కొరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ సంక్రమించడం మొదలయి దాదాపు పదినెలలకు పైగా కావస్తున్నా ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం కలవర పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో భారత్లోకి ప్రవేశించిన మహమ్మారి..ప్రజలపై పంజా విసురుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొరోనా వైరస్ మరణాల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ ధాటికి ఇప్పటి వరకు 1,00,842 ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
గడిచిన 24 గంటలలో కరోనా సోకి 1069 మంది మృతి చెందడం అధికారులను, ప్రభుత్వాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,545కి చేరింది. తాజాగా ఒక్కరోజులోనే 79,476 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో వైరస్ నుంచి కోలుకుని 75,628 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్ అయిన వారి సంఖ్య 54,27,706కి చేరడం కొంత ఊరట కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 9,44,996 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొరోనా బాధితుల రికవరీ రేటు 83.84 శాతంగా నమోదు కాగా.. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 14.60 శాతం ఉంది. ఇక 24 గంటలలో 11,32,675 కొరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 7,78,50,403 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.