కొరోనా మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో చాలా బాధ్యతా రాహిత్యంగా, నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు అక్షింతలు వేసింది. కొరోనా వల్ల మరణించిన వారి మృత దేహాలను సామూహికంగా దహనం చేసిన సంఘటనల వీడియోలు బయట ప్రసార సాధనాల్లో వొచ్చినా కోర్టు ముందు ఉంచనందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు ఒక ప్రకటనలో 53 మంది శవాలను ఒకేసారి దహనం చేసినట్టు ఆరోపించారు. వాటిని దహనం చేసిన వారు పీపీఈ కిట్స్ ధరించారని కూడా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
హైదరాబాద్ లో కొరోనా మరణాలను ప్రభుత్వం దాచి పెడుతోందని హక్కుల ఉద్యమ కారులు ఆరోపించారు.కోవిడ్ -19 నిబంధనల ప్రకారం కొరోనా మృతుల శవాలను ఖననం చేసినా, దహనం చేసినా ఉచితంగానే చేయాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది.అయితే, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పేదేమంటే ప్రోటోకాల్ ప్రకారం ఈ శవాలను సంస్కరించాల్సిన సిబ్బంది వేతనాల పరమైన సమస్యల కారణంగా వాటిని సేకరించకపోవడం వల్ల అవి గుట్టలుగా పేరుకుని పోయాయని అంటున్నారు. సామూహిక దహన కార్యక్రమానికి సిబ్బంది వేతన పరమైన సమస్యలు అడ్డంకిగా నిలిచాయని పేర్కొన్నారు. కొరోనా మృతుల శవాలను ఒకే రోజున దహనం చేయాల్సి వచ్చినట్టు వారు చెప్పకనే చెప్పారు. ‘‘అయితే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ శవాలు కరోనా మృతులవి కావని ఆయన అన్నారు, రికార్డుల్లో ఆ శవాలు వేరే కారణాల వల్ల మరణించినవారివని పేర్కొనబడ్డాయని వివరించారు. కొరోనా మృతుల సమాచారాన్ని ప్రభుత్వం సమగ్రంగా, సూటిగా, స్పష్టంగా అందించడం లేదన్నది స్పష్టం అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 పై ఏర్పాటు చేసిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ చెప్పిందేమంటే, కోవిడ్ -19 మరణాలను అధికారికంగా నమోదు చేయాలని. అయితే, తెలంగాణ ప్రభుత్వం తన మార్గంలో తాను వెళ్తోంది.దవాఖానల శవాగారాల్లో పేరుకుని పోయిన శవాలన్నీ కోవిడ్వి కావనీ, వేరే కారణాల వల్ల మరణించిన వారివనీ, వాటిని పరిష్కరించాల్సిన సిబ్బంది వేతన వివాదం కారణంగా విధులు నిర్వహించకపోవడం వల్ల అవి పేరుకుని పోయాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కోవిడ్-19 మరణాలు ఎన్నో వాస్తవంగా వెల్లడి కావడం లేదు. కోవిడ్ మరణాలు ప్రభుత్వం ఇస్తున్న లెక్కల కన్నా ఇంకా ఎక్కువ ఉండవచ్చు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాల నమోదులో ఐసిఎంఆర్ మార్గదర్శకాలను పాటించడం లేదని స్పష్టం అవుతోంది. అంతేకాక, కోవిడ్ మరణాలు ఇళ్ళ వద్ద సంభవించాయో, హాస్పిటల్స్ లో సంభవించాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఇటీవల విడుదల అయిన అధ్యయన నివేదికలో పేర్కొన బడింది., ‘కొరోనా ఎపిడమిక్ ఇన్ ఇండియా – ఏన్ అకలాజికల్ స్టడీ’ పేరిట ఈ అధ్యయనం జరిగింది. ఇది లాన్ సెట్ లో ప్రచురితం అయింది.
రాష్ట్ర సరిహద్దులను స్వేచ్ఛగా వదిలేయడం, పలు రంగాల్లో అన్ లాక్ ప్రకటించడం వంటి కారణాల వల్ల కోవిడ్ వ్యాప్తి జరిగి ఉండవచ్చు. తిరిగి లాక్ డౌన్ లు విధిస్తే జిల్లాల్లో కేసులు పెరుగుతాయేమోనన్న భీతి ఉంది, కొరోనా మరణాల వివరాలను దాచి పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. ఏ ఒక్క మరణానికి కారణాన్ని దాచి పెట్టలేదనీ, వాటిని నిర్ధారించడానికి రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు మరణాల గురించి బులిటెన్లలో స్పష్టంగా ఉండవనీ, కేవలం అనుమానంతో మాత్రమే వాటిని ఉదహరించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం మూడు వైపుల నుంచి సమస్యలను ఎదుర్కొంటోందని స్పష్టం అవుతోంది. పరీక్షలు జరిపే సామర్ధ్యం లేకపోవడం మొదటిది. ఆరోగ్య రక్షణ వ్యవస్థను సమూలంగా మార్చలేకపోవడం., ప్రోటోకాల్స్ పాటించలేకపోవడం. అంతేకాక, పీపీఈలు తగినన్ని సరఫరా కాకపోవడం, వేతనాల సమస్య మొదలైనవి అన్నీ ఉన్నాయి. మరణాల గురించి పూర్తి సమాచారాన్ని అందించలేకపోవడానికి ఉద్దేశ్య పూర్వకంగా రిస్క్ తో కూడిన వైఖరిని అనుసరించడం, యంత్రాంగం నిర్ల క్ష్యం మొదలైన కారణాల వల్ల మరణాల రేటు సక్రమంగా నమోదు కావడం లేదు.