Take a fresh look at your lifestyle.

కొరోనా కౌంటర్‌ ఎటాక్స్

రాష్ట్రంలో ఒకవైపు కొరోనాపై యుద్ధమే జరుగుతుంటే, మరో వైపు ఈ వైరస్‌పై రాజకీయ రగడ కొనసాగుతున్నది. నాలుగు విడుతల లాక్‌డౌన్‌తో దేశంలో కొరోనాను కట్టడిచేయలేకపోయారనేందుకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ వైరస్‌ను ఇంకా నిలువరించలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ప్రజలను కొరోనాతో సహజీవనం చేయాల్సిందేనని అవి చెప్పుకొచ్చాయి. దేశంలో ఇప్పుడదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ విషయానికికొస్తే వాస్తవంగా రాష్ట్రంలో కోవిడ్‌-19 ‌పరీక్షల సంఖ్య పెంచినప్పటి నుండి పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందంటే, నాల్గవ విడుత లాక్‌డౌన్‌ను సడలించినప్పటి నుండి నిజంగానే ప్రజలు కొరోనాతో సహజీవనం చేస్తున్నారన్నది వాస్తవమేమోననిపిస్తున్నది. కేవలం ఒక్క తెలంగాణలోనే కాకుండా ఈ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. కాని, ఈ విషయంలో బిజెపి మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. కొరోనాను కట్టడిచేయడంలో తెలంగాణ సర్కార్‌ ‌పూర్తిగా విఫలమైందని ఏకంగా ఆందోళన బాటపట్టింది. ప్రభుత్వ చర్యలపట్ల తెలంగాణ వ్యాప్తంగా తమ నిరసనను తెలియజేయడంలో భాగంగా రాష్ట్ర రాజధానిలోని కోఠీ సెంటర్‌లో ఉన్న కొరోనా కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేసింది. దీనిపై టిఆర్‌ఎస్‌, ‌బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. బిజెపి పాలిత రాష్ట్రమైన హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వం కొరోనాను నిరోధించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నదన్నది బిజెపి సవాల్‌ ‌విసురుతుండగా, ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ‌పరిస్థితేమిటని టిఆర్‌ఎస్‌ ఎదురుదాడి మొదలుపెట్టింది. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో ఇంకా పాజిటివ్‌ ‌కేసులకు చికిత్స కొనసాగుతోంది. కాగా గుజరాత్‌లో కొరోనా కంట్రోల్‌ ‌కాకపోవడానికి మోదీ బాధ్యత వహిస్తారా అంటు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ ‌నిరోధానికి అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ గడచిన ఇరవై నాలుగు గంటల్లో 580 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 27వేల 317 పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా, 1664 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా నిన్నటి ఆదివారం ఒక్క రోజున్నే 730 పాజిటివ్‌ ‌కేసులు నమోదవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా భయాందోళనకు గురిచేస్తున్న అంశం.

ఈ కేసుల్లో రాజధాని, దాని పరిసర ప్రాంతాలకు చెందినవే ఎక్కువ. జీహెచ్‌ఎం‌సి పరిధిలో 659,రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 9 కేసులు రాగా, మిగతావి వివిధ జిల్లాలకు చెందినవి కావడం విశేషం. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన సంఖ్య 7వేల 802కు పెరిగినట్లైంది. ఇక్కడ మరింత ఆందోళన కలిగిస్తున్న అంశమేమంటే యుద్ధ వీరుల్లా మొదటివరుసలో నిలిచిన వైద్యులకు, వారి సిబ్బందికే పాజిటివ్‌ ‌రావడం. అలాగే కోవిడ్‌ ‌విషయాలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు పలువురు ఈ వైరస్‌ ‌బారిన పడ్డారు. వైరస్‌ ‌ప్రమాదానికి గురికాకుండా కంటికి రెప్పలా కాపలా కాస్తున్న పోలీసు సిబ్బందికీ చుట్టుకుంది. వీరిలో కొందరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు కూడా దవాఖానాల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచివాలయం, జీహెచ్‌ఎం‌సితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా క్రమేణా సోకుతోంది. లాక్‌డౌన్‌ ‌సడలించిన జూన్‌ ఒకటి నుండి ఇప్పటి వరకు దాదాపు అయిదు వేలకు పైగానే కేసులు నమోదు అవడం గమనార్హం. అయితే పరీక్షల సంఖ్య పెంచడంవల్లే కేసులు పెరుగుతున్నాయంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు రోజుకు 22వేల కొరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నది. త్వరలో వీటిని 30వేలకు పెంచాలనుకుంటున్నట్లు కూడా చెబుతోంది. కాని, వాస్తవంగా ప్రభుత్వం చేయాల్సినన్ని పరీక్షలు చేయడంలేదని, తక్కువ స్థాయిలో పరీక్షలు చేస్తేనే పాజిటివ్‌ ‌కేసులు ఇంతలా పెరిగితే, పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తే మరెన్ని కేసులు నమోదు అవుతాయోనని ప్రతిపక్షాల వాదన. దీనికితోడు ప్రభుత్వం కావాలనే టెస్ట్‌ల రిజల్టస్‌ను ఆలస్యంగా అందజేస్తుండడంతో పలు కేసులు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయంటూ ప్రతిపక్షాలు కౌంటర్‌ ఎటాక్‌ ‌చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గత ఎనిమిది రోజుల్లోనే దేశంలో లక్షమంది వైరస్‌ ‌బారిన పడ్డట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లోనే 15వేల 413 కేసులు వెలుగుచూశాయంటే దేశవ్యాప్తంగా వైరస్‌ ఏవిధంగా విజృంభిస్తున్నదన్నది అర్థమవుతున్నది. మహారాష్ట్ర ఇంకా కోలుకోలేకపోతున్నది. తాజా లెక్కల ప్రకారం లక్షా 4 వేలకు పైగానే కేసులు నమోదుకాగా, 5వేల 893 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే చెన్నై తిరిగి లాక్‌డౌన్‌ను అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి మొదటి విడుత లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తుంది. కాదని కొరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే మాత్రం దేశవ్యాప్తంగా మరిన్ని మరణాలు తప్పేట్లు లేవు.

Leave a Reply