Take a fresh look at your lifestyle.

నిన్నటి వరకు కొరోనా ఖర్చు.. ఇక స్కూలు ఫీజుల మోత

కొరోనా వ్యాప్తి కారణంగా పదిహేను నెలల కిందట మూతపడిన పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ ‌సెంటర్లు అన్నిరకాల విద్యాసంస్థలను రాష్ట్రంలో జూలై ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఒక వైపు ఉత్సాహం వెల్లివిరుస్తుండగా, మరోవైపు ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది మార్చ్‌లో కొరోనా భూతం జడలు విప్పుకుని నాట్యం మొదలెట్టినప్పటి నుంచీ రెండు దశల్లో జనావళి అల్లకల్లోలలమై పోయింది. వయసు తారతమ్యం, బీదా బిక్కీ, సామాన్యుడు గొప్పవారు తేడా లేకుండా మహమ్మారికి బలైపోయి కుటుంబాలకు కుటుంబాలు నిలువునా వణకిపోయాయి. మొదటి ముప్పుకంటే రెండో ముప్పు విలయతాండవం చేసి చికిత్స కోసం తాకట్లు పెట్టి తెచ్చిన సొమ్ము కూడా చాలక ప్రాణాలు హరీ మంటే మానసికంగా ఆర్థికంగా నిలువునా కుంగిపోయారు ప్రజలు. మొడటి ధాటి కంటే రెండో దాడి భయంకర ఫలితాలు మిగిల్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహరచన, ముందు జాగ్రత్త లేకపోవడం అందుకు కారణమని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఇంకెంతకాలం ఈ నిర్బంధ లాక్‌ ‌డౌన్లనే యోచనతో అన్ని నిబంధనలు సడలించి ఒక్కొక్క రాష్ట్రం లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో జనజీవనం రైలుపట్టాల నెక్కించే దిశగా ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ఎత్తి వేసి జాగ్రత్తలు చెబుతూ వివిధ రంగాలకు వివిధ స్థాయిల్లో స్వేచ్ఛ ప్రకటించింది. ప్రథమ తాంబూలం వాణిజ్య వ్యాపార రంగాలకు కాగా రెండో ప్రాధాన్యం విద్యా రంగానికిచ్చింది.

పూర్తిస్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖను తెలంగాణ మంత్రివర్గం ఆదేశించింది. ఈ విషయంలో ఎటువంటి అసందిగ్ధతకు అయోమయానికి అవకాశం లేదని పేర్కొన్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఆన్లైన్‌, ఆఫ్లైన్‌ ‌రెండు పద్ధతుల్లో విద్యాబోధన విధానం సిద్ధమౌతున్నది. విద్యాసంస్థలు భౌతికంగానే పునఃప్రారంభం అవుతాయని, ఆన్లైన్‌ ‌క్లాసుల కొనసాగింపు, తప్పనిసరి హాజరుకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి, న్యాయస్థానం సూచనలను కూడా పాటిస్తూ భవిష్యత్‌ ‌కార్యక్రమం సిద్ధం చేయాలని విద్యాశాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన పాఠశాల, ఇంటర్‌, ఉన్నత, సాంకేతిక విద్య తదితర అన్ని విభాగాధికారులతో సమావేశమై విద్యాసంస్థల ప్రారంభానికి పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖరారుచేశారు ఇప్పటివరకు ఆన్లైన్‌ ‌క్లాసులు మూడో తరగతి నుంచి కొనసాగుతుండగా, ఈ సారి ఒకటో తరగతి నుంచే ప్రారంభించనున్నట్టు అధికారవర్గాల సమాచారం.

ఆన్లైన్‌ ‌క్లాసులు టీశాట్‌ ‌ద్వారా అందించాలని, భౌతికంగా కూడా విద్యా బోధన జరుగుతుందనీ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు తప్పనిసరి. విద్యార్థులంతా తరగతులకు హాజరుకావాల్సిందే. విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, విద్యార్థులు భౌతికంగా తరగతులకు హాజరు కావాలంటే తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరి. విద్యాసంస్థలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమందికి భౌతిక బోధన చేయాలి? ఎవరికి ఆన్లైన్‌ ‌క్లాసులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారుచేస్తారు. విద్యార్థులు మాత్రం ఏదో ఒక విధానంలో తరగతులకు హాజరుకావటం తప్పనిసరి చేయనున్నారు. విద్యార్థులు నష్టపోరాదని, చదువులలో వెనుకబడరాదని భావించిన ప్రభుత్వం ఈ ఏడాది ఆలస్యం కాకుండా తరగతుల నిర్వహణకు అనుమతినిచ్చింది. నేరుగా కానీ, ఆన్‌ ‌లైనె ద్వారా కానీ విద్యర్థుల హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం రానుంది. పాఠశాలలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సంఘాలు స్వాగతించాయి.

స్కూళ్ళు ప్రారంభం అవుతున్నాయంటే తలిదండ్రుల గుండెల్లో జెట్‌ ‌విమానాలు పరిగెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా అన్ని విధాలుగా చితికి బక్క చిక్కిపోయిన కుటుంబాలకు స్కూల్‌ ‌ఫీజులు మరో భయం కలిగిస్తున్నాయి. ఆర్థికంగా, చితికిపోతిన తాము భారీఫీజులు చెల్లిస్తూ పిల్లలకు మంచి నాణ్యత, ప్రమాణాలతో కూడిన చదువెలా అందించగలమన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. ప్రైవేటు స్కూళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులతో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. విద్యార్థి మోసే బరువు కన్నా ఫీజుల బరువు తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిలా తయారైంది. ఆన్‌ ‌లైన్‌ ‌చదువులకోసం మొబైల్‌, ‌లాప్‌ ‌టాప్‌, ఇం‌టర్‌ ‌నెట్‌.. అదనపు బరువు. ప్రైవేటు/ కార్పొరేట్‌ ‌పాఠశాలల యాజమాన్యాలు ఎవరికి వారు స్వయంగా ఫీజుల నిర్ణయాధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్‌ ‌స్కూళ్ల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ చర్యలకెందుకింత ఆలస్యమన్న విమర్శలున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కుదరక, గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే విద్య నేర్పించాలన్న లక్ష్యంతో సగటు తల్లిదండ్రులందరూ ప్రైవేటు, కార్పొరేట్‌ ‌స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రకరకాల ఫీజులతో వేల నుంచి లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో జేబులే కాదు.. ఇళ్లు గుళ్ళవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు స్కూళ్లు రాష్ట్రంలో సమాంతర వ్యవస్థలా తయారై విద్యావ్యస్థను శాసిస్తున్నాయి. అక్షర వ్యాపారం లక్షల నుంచి కోట్లకు పడగతెల్తి బుస కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల అక్రమ అధిక ఫీజుల వసూళ్లపై కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం.

హైదరాబాద్‌ ‌మహానగరంలో ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు ఏకతాటిపై నిలచి ఒక మాఫీయాగా మారి నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అడ్మిషన్ల సమయంలో ఫీజులు నియంత్రిస్తామని చెప్పిన పాలకులు.. తర్వాత కార్పొరేట్‌ ‌యాజమాన్యాల నజరానాలు పొంది.. మౌనం పాటించడం అనావాయితీగా మారిపోయిందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అనేక స్కూళ్లకు పాఠ్య ప్రణాళికలో వేర్వేరుగా ప్రత్యేక విధానాలున్నా..ఫీజుల విషయంలో ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి. తరగతుల వారీగా స్లాబ్‌ ‌విధానాన్ని అమలు చేస్తూ ఫీజు వసూలు చేస్తున్నాయి. వీటికితోడు ఐఐటి, మెడికల్‌ ‌ప్రత్యేక ఫౌండేషన్‌ అం‌టూ ఒక్కొ తరగతికి ఒక్క లెక్క చొప్పున వేలకు వేలు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా ప్రతి స్కూల్‌, ‌రవాణా సౌకర్యం కోసం, మధ్యాహ్నం లంచ్‌, ఇలా అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. డే స్కాలర్స్‌కు ఒక లెక్క, సెమి రెసిడెన్షియల్స్ ఒక లెక్క, రెసిడిన్షియల్స్‌కు ఒక విధానం ఇలా వేటి లెక్కలు వాటికే గుంజుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైయిందంటే అన్ని ప్రైవేటు స్కూళ్ల ప్రాంగణాలు దుకాణాలను తలపిస్తాయి.

పెన్సిల్‌ ‌దగ్గరి నుంచి పుస్తకాలకు వేసుకునే ఆట్టలు, కవర్లు కూడా అన్ని అక్కడే కొనుగోలు చేయాలి. అంతేకాదు స్కూల్‌ ‌యూనిఫామ్స్, ‌షూస్‌, ‌సాక్స్, ‌టై, బెల్ట్ అం‌డ్‌ ‌బ్యాడ్జ్లు, అక్కడే కొనుగోలు చేయాలి. ప్రాథమిక తరగతుల వరకు పుస్తకాలు, నోటు పుస్తకాలు ఏ ఏడాదికాయేడు మారుతూ ఉంటాయి. పుస్తకాలు ప్రచురించి అమ్మకాలు చేసే పబ్లికేషన్స్ ఎన్నో ఉంటాయి. స్కూల్‌ ‌యాజమాన్యానికి కమిషన్లు ఇస్తే ఆ పబ్లికేషన్‌ ‌ప్రచురించిన పుస్తకాలనే సిలబస్‌గా పెట్టే స్కూళ్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ పబ్లికేషన్‌ ‌ముద్రించిన పుస్తకాల్లో ఏమేరకు విద్యార్థికి ఉపయోపడతాయి? అందులో నాణ్యత ఎంత ఉంది? లాంటి విషయాలేవీ పట్టించుకోకుండా యాజమాన్యాలు విద్యార్థులకు అంటగట్టే సంస్కృతి రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ‌స్కూళ్లలో ఈ అక్రమాలన్నీ నివారించి.. మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫీజులు నిర్ణయించి వాటిని ఖచ్చితంగా అమలు చేసేలా సర్కారు వెంటనే చర్యలకు ఉపక్రమించాలని తలిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply