Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణపై…. ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదు

టెస్టుల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్‌కు సూచించా
జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్‌ ‌తమిళిసై 

తెలంగాణలో కొరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని గవర్నర్‌ ‌తమిళిసౌ సౌందరరాజన్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరోనా ఉధృతిని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్‌ను నియంత్రించాలంటే పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం ఒక్కటే పరిష్కారమని స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌తనతో సమావేశమనప్పుడు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇక్కడ ఓ జాతీయ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొరోనా నియంత్రణలో భాగంగా టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిందనీ, ఇదే విషయాన్ని తాను కూడా చెప్పాననీ, మెబైల్‌ ‌టెస్టింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఐదారు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగినప్పుడల్లా ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు.

కొరోనా బాధితులు ప్రభుత్వ దవాఖానాలలో సరైన వసతులు లేకపోవడంతో ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించారనీ, ఇదే అదనుగా అక్కడ చికిత్సల పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేశారని చెప్పారు. కోవిడ్‌ ‌చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా పరిణమించిందనీ, అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం పదేపదే చెప్పినప్పటికీ బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్స్‌పై నమ్మకం కలగలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ‌తనతో సమావేశమైనప్పుడు రాష్ట్రంలో కొరోనా పరిస్థితిపై అన్ని విషయాలు చెప్పానని తెలిపారు. అయితే, తెలంగాణలో కొరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజుల్లో అప్రమత్తంగా లేనప్పటికీ ఆ తరువాత టెస్టుల సంఖ్యను పెంచడం, నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు హాస్పిటల్స్ అనుమతులు రద్దు చేయడం వంటి చర్యలతో పరిస్థితి కొంతమేర నియంత్రణలోనికి వచ్చిందని గవర్నర్‌ ‌తమిళిసై పేర్కొనడం విశేషం.

Leave a Reply