ఆర్టీసీ, మద్యం విక్రయాలపై ప్రధానంగా చర్చ
రాష్ట్రంలో కొరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయినప్పటికీ, రాష్ట్రంలో లాక్డౌన్ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, లాక్డౌన్ సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల తరలింపు, నిబంధనలతో కూడిన మద్యం విక్రయాలు ఇందులో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా గత మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలను కొనసాగించాలా ? వద్దా ? అనే విషయాన్ని ఈనెల 15న మరోమారు సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఈరోజు సమీక్షా సమావేశంలో సీఎం ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఏపీ సైతం ప్రజా రవాణా వ్యవస్థను క్రమక్రమంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్న దృష్ట్యా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే అంశంపై సైతం కేసీఆర్ సమీక్షించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ రాష్ట్రంలోని అన్ని డీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో బస్సులను నడపాలా ? వద్దా ? అనే అంశంపై నేటి సమావేశం అనంతరం సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే, గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి గల కారణాలు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సైతం సీఎం చర్చించి చేపట్టనున్న నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.