Take a fresh look at your lifestyle.

కరోనా కల్లోలం గల్ఫ్ ‌దేశాల్లో భారత కార్మికుల దయనీయ స్థితి

  • క్షణక్షణం బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం..
  • పట్టించుకోని లేబర్‌ ‌కాంట్రాక్టర్లు..ఏజెంట్లు

ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి పొట్ట చేత బట్టుకుని ఎడారి దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు కరోనా వైరస్‌ ‌కారణంగా గల్ఫ్ ‌దేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. పస్తులతో, తీవ్ర భయాందోలనలతో కాలం వెల్లదీస్తున్నారు. ఏ క్షణాన, ఏమి జరుగుతదో… ఎవరికి కరోనా సోకుద్దో అనే భయంకరమైన వాతావరణంలో మనోళ్లు ఉన్నారు. దుబాయ్‌ ‌దేశములో లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేశారని, కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వాళ్ళతోనే మనవాళ్ళు క్యాంపుగదుల్లో సహ జీవనం కొనసాగిస్తున్నట్లు వాళ్లు తెలిపారు. గల్ఫ్ ఏజెంట్లు గానీ, సంబంధిత కంపెనీల వారు గాని పట్టించుకోవడం లేదన్నారు. లేబర్‌ ‌కాంట్రాక్టర్లు మెడికల్‌ ‌పరీక్షల ఊసెత్తడం లేదని మనవాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి ఫోన్‌ ‌చేసి చెపితే ఇంట్లో వాళ్ళు బాధపడుతారని బంధు మిత్రులకు వీడియో కాల్‌ ‌చేసి అక్కడి బాధలు, పరిస్థితులు వివరిస్తూ రోధిస్తున్నారు.

రెండురోజులుగా దుబాయ్‌, అబుదాబిలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో కరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 10000 పైగా కేసులు అక్కడ నమోదు కాగా రెండు రోజుల్లో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,000 పైనే నమోదయినట్టు గల్ఫ్ ‌కార్మికుల రక్షణ సమితి పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ ‌దేశాలకు వెళ్లిన లక్షలాది మంది జీవితాలు కరోనా వైరస్‌తో ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది కార్మికులు పనులకు వెళ్లకుండా లేబర్‌ ‌క్యాంపులోని గదులకే పరిమితమయ్యారు. ఈ గదుల్లో వందల మంది ఉన్నారని, వీరిలో ఎందరికీ వైరస్‌ ‌సోకిందో ఎవరికీ అంతుబట్టని విధంగా ఉందని సమాచారం. దుబాయిలో పాజిటివ్‌ అని తేలిన వ్యక్తులను ఇక్కడి ప్రభుత్వం ఐసోలేషన్‌కు తరలించకుండా రూంలోనే ఉంచుతున్నారని మన వాళ్ళు వాపోయారు. ఒకే గదిలో పాజిటివ్‌, ‌నెగిటివ్‌ ‌వ్యక్తులను కలిపి ఉంచుతుండడంతో అందరికీ వైరస్‌ ‌సోకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందరిలో భయం
వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తులతో కూడి తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారితో పాటు, కేరళ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు చిన్న చిన్న గదుల్లో పక్కపక్కనే ఉంటున్నారు. ఐదారుగురు వ్యక్తులకు ఒక గది చొప్పున కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసినా పనులు దొరక్క చాలామంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో పనులు చేసే వారిని కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రావద్దని అక్కడి యజమానులు సూచించడంతో వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇతర గల్ఫ్ ‌దేశాలు అయిన దుబాయి, మస్కట్‌, ‌ఖతార్‌లలో కూడా పరిస్థితి అలాగే ఉందని అక్కడి కార్మికులు పేర్కొంటున్నారు.

మే 3 తర్వాత స్వదేశానికి?
లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మే 3తో లాక్‌డౌన్‌ ‌గడువు ముగియనుండడంతో ఆ తర్వాతే వారిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్రం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం ఓ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల జాబితాను రాష్ట్రాలను కేంద్రం కోరిందని సమాచారం. వారిని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం. వారు రాష్ట్రాల్లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక క్వారంటైన్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి స్థానిక కరోనా వైరస్‌ ‌బాధితులతో వారిని కలవకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ఉన్నతాధికారులతోనూ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత స్వదేశానికి రావాలనుకుంటున్న భారతీయులందర్నీ తీసుకెళ్తామని, అందుకు కొంత గడువు కావాలని ఇప్పటికే గల్ఫ్ ‌దేశాల రాజ కుటుంబాలను ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కోరారు. మరోవైపు, విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ ‌కార్యదర్శి రాజీవ్‌గౌబా ఇటీవల సంప్రదింపులు జరిపారు. గత శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై కేబినెట్‌ ‌కార్యదర్శి సంకేతాలు ఇచ్చిన మరుసటి రోజే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పరిశీలనకు వచ్చాయి.

- Advertisement -

ఒకేసారి వచ్చేస్తే సనిస్థితి?
విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది భారతీయులు ఒకే సారి వస్తే.. రాష్ట్రాల్లో సరిపడా వసతులు ఉన్నాయా…? లేవా…? అని కేంద్రం ఆరా తీస్తోంది. అంతర్జాతీయ కనెక్టివిటీ అంతగాలేని ఆంధప్రదేశ్‌, ‌బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌ ‌ప్రవాసులు ఇతర రాష్ట్రాల్లో దిగితే.. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత వారిని క్వారంటైన్‌లో ఉంచాలా..? లేదా…? విమానాశ్రయాల సమీపంలోనే ఉంచాలా…? అని సమాలోచనలు జరుపుతోంది. గల్ఫ్ ‌దేశాల నుంచే లక్ష మంది కేరళీయులు తిరిగొచ్చే అవకాశం ఉండగా, ఇందుకు తగ్గట్లుగా అక్కడ క్వారంటైన్లు లేవని తెలుస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే.. గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రి ఉన్నా 3 విమానాల ప్రయాణికులతోనే అది నిండిపోయే అవకాశం ఉంది. ఇతర క్వారంటైన్‌ ‌సెంటర్ల వివరాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రయాణికులు హైదరాబాద్‌లో దిగితే.. రాష్ట్రం భరించ గలుగుతుందా అని కేంద్రం ఆరా తీస్తోంది. వేలాది మంది ఆంధప్రదేశ్‌ ‌వాసులు కూడా కువైట్‌ ‌నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ సాధారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో దిగడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు వీరిని చెన్నైలోనే ఉంచాలా…? లేదా…? వారి సొంత గ్రామాలకు తరలించాలా..? అనే దానిపై స్పష్టత లేదు. అక్కడి ప్రభుత్వం అమ్నెస్టీ ప్రకటించినా..ఈ కారణంగానే భారత ఎంబసీ తాత్సారం చేస్తోంది. ప్రవాసీ ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటే విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాలు దిగడానికి అనుమతించే అవకాశాలను కూడా తోసి పుచ్చలేమంటున్నారు. లాక్‌ ‌డౌన్‌కు ముందు చైనా, ఇరాన్‌ ‌నుంచి తీసుకొచ్చిన భారతీయులను రాజస్థాన్‌, ‌హరియాణా లోని సైనిక దళాల ఆస్పత్రుల్లో ఉంచారు. ఇప్పుడు ప్రవాసుల సంఖ్య భారీగా ఉన్నందున రాష్ట్రాల సహకారం అవసరమని కేంద్రం గుర్తించింది.

కుటుంబ సభ్యుల్లో ఆందోళన
గల్ఫ్‌లో తమవాళ్లు కరోనా కారణంగా క్యాంపుల్లోనే బందీలై..తిండిలేక..జీతాల్లేక..ఎలాంటి పరీక్షల్లేక ఎలా బతుకుతున్నారోనని ఇక్కడ వారి కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. ఫోన్లలో వీడియో కాల్‌ ‌ద్వారా తమవాళ్లు ఎలా ఉన్నారని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తినడానికి డబ్బులు అవసరమైతే చెప్పండి అప్పోసప్పోజేసి పంపిస్తమని, కానీ భయపడవద్దని కుటుంబ సభ్యులు గల్ఫ్‌లో ఉన్నవారికి ధైర్యం చెపుతున్నారు లక్షలాది మంది వలసజీవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాల్సిన తరుణమిది. వాళ్లను ప్రత్యేక విమానాల్లో రప్పించి కరోనా పరీక్షలు నిర్వహించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని వలస జీవులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

భవిష్యత్తులో కూడా పనిచేసే పరిస్థితి లేదు..ఒమన్‌ ‌నుండి ఓ బాధితుడి ఆవేదన

indians in omen country

ఇక్కడ పనిచేసే కార్మికులు స్వరాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒమన్‌ ‌దేశం నుండి ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గల్ఫ్ ‌దేశాల్లో మన రాష్ట్రానికి చెందిన వేల మంది కార్మికులు దీనావస్థలో ఉన్నారరని, ఇక్కడ ఉండి భవిష్యత్తులో తాము పనిచేసే పరిస్థితి లేదని, ప్రస్తుతం సొంత ఊరి నుంచి డబ్బులు పంపిస్తే తాము ఇక్కడ కిరాయిలు కట్టుకుంటున్నామన్నాని, ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారని తమ దయఈయ పరిస్థితిని వివరించాడు. లాక్‌డౌన్‌ అనంతరం సిఎం కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌లు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే ఇదే విషయాన్ని టిఆర్‌ఎన్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ ‌మహేశ్‌ ‌బిగాల దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఆయన ఇక్కడ అవస్థలు పడుతున్న కార్మికులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.
చుక్క గంగారెడ్డి

Leave a Reply