Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో కరోనా కల్లోలం ఏడుగురికి పాజిటివ్‌

  • వంద బృందాలతో పరీక్షలు
  •  రాష్ట్రంలో పదమూడుకు చేరిన కరోనా బాధితులు మండువ రవీందర్‌ ‌రావు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌కరీంనగర్‌కు పాకడంతో  ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు మొదలైనాయి. ఒకేసారి ఏడుకేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. బాదితులు ఇండోనేషియన్‌కు చెందినవారిగా అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ ఉన్న కేసులసంఖ్య పదమూడుకు చేరుకుంది. ఈనెల పదహారు నుండి వీరిని ఐసోలేషన్‌ ‌వార్డుల్లోఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. వీరి ద్వారా మరెంతమందికి ఈ వ్యాధి సోకిందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనావ్యాధి జిల్లాలకు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ ఈ బృందం కరీంనగర్‌ ‌జిల్లాకు ఎలా చేరుకుందన్నది అంతుబట్టకుండా ఉంది. ఇండోనిషియాకు చెందిన ఈ ఏడుగురి బృందం కొద్దిరోజుల క్రితం మతపరమైన కార్యక్రమాలపై కరీంనగర్‌కు వచ్చింది. అప్పటి నుండీ వీరు రామగుండంతోపాటు ఇతర ప్రాంతాల్లో  పర్యటించినట్లు తెలుస్తున్నది.

ఈ సందర్భంగా ఈ బృందం అనేక మందిని కలిసి మాట్లాడినట్లు తెలుస్తున్నది. వివిధ ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఎక్కువగా మసీదుల్లోనే బసచేసి, అక్కడికి వచ్చే వందలాది మందితో వీరు కలిసి మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ బృందం కరీంనగర్‌కు చేరినప్పటి నుండీ ఏయే ప్రాంతాల్లో వీరు పర్యటించారు? ఎవరెవరిని కలిశారన్న విషయాలను అధికారులు, పోలీసులు ఆరా తీసేపనిలో పడ్డారు. ఇతర ప్రాంతాలేమైనా తిరిగారా? అక్కడ ఎవరితోనైనా మాట్లాడారా అని తెలుసుకునేందుకు జిల్లాల్లోని సిసిఫుటేజీలను కూడా పరిశీలించేపనిలో పడ్డారు అధికారులు. ఇందుకుగాను ప్రభుత్వం  ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేసింది.

కరోనా ప్రభావం తెలంగాణలో పెద్దగా లేదనుకుంటున్న తరుణంలో కరీంనగర్‌ ‌జిల్లాలో ఒకేసారి ఏడుగురికి పాజిటివ్‌ ఉం‌దని తేలటంతో రాష్ట్రమంతా భయాందోళనకు గురవుతున్నది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన పాజిటివ్‌ ‌కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారికి సంబంధించినవి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ దేశాలనుండి వస్తున్నవారిని తిప్పిపంపడమో, వారికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఇండ్లకు పంపించడమో చేస్తున్నది. ఈ వైరస్‌ ‌ప్రబలంగా ఉన్న దేశాలకు సంబంధించిన విమానాల రాకపోకలను కూడా నిరోధించారు. ఇన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఇండోనేషియా బృందం కరీంనగర్‌కు ఎలా చేరుకుందన్నది ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతున్నది.

హై అలర్ట్…
‌కొద్ది రోజుల కింద ఇండోనేషియా సందర్శకుల బృందం ఒకటి భారత్‌కు వచ్చింది. డిల్లీనుంచి సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో  తెలంగాణ వచ్చిన వీరు కరీంనగర్‌, ‌రామగుండం తదితర ప్రాంతంలో  మార్చ్ 14, 15 ‌తేదీల్లో  పర్యటించినట్లు తెలుస్తున్నది. కాగా వీరికి కరోనా వ్యాధి లక్షణాలున్నట్లు అధికారులు ఈ నెల పదహారున గుర్తించి, వీరిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే వీరు తిరిగిన ప్రాంతాలన్నిటినీ పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయానికి సమీపంలోనే వీరు  బసచేసినట్లు  తెలుస్తున్నందున, కలెక్టర్‌ ‌కార్యాలయానికి దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలోఉన్న అందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఆయా ప్రాంతాల్లో నివసించేవారిపైన కొన్ని ఆంక్షలు కూడా విధించాలని కూడా దీనిపై అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లామంత్రి గంగుల కమలాకర్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌శశాంక, నగర సిపితోపాటు వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయంతీసుకున్నారు.

ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నట్టు గుర్తించామని.. ఆ సమయంలో సంచరించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను గుర్తించామని సమావేశం తర్వాత మంత్రి గంగుల డియాకు వెల్లడించారు. కలెక్టరేట్‌ ‌పరిధిలోని ఓ ప్రార్థనామందిరంలో గడిపినట్టు గుర్తించామని,  కలెక్టరేట్‌ ‌కేంద్రంగా మూడు కిలోటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గురువారం నుంచి వంద వైద్య బృందాలను రంగంలోకి దిం పుతున్నట్టు తెలిపారు. ప్రజలు నాలుగురోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దని కోరారు. జిల్లాకేంద్రంలో 20 ఐసొలేషన్‌, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటుచేశామని, రెండు ప్రైవేటు దవాఖానలు ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్‌ల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. కరీంనగర్‌ ‌నగరమంతటా శానిటైజేషన్‌ ‌చేస్తున్నామని, జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడవద్దని ప్రచారంచేస్తున్నామన్నారు. అత్యవసరంగా చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్‌ ‌రెస్పాన్స్ ‌బృందాలను రంగంలోకి దింపాలని వెల్లడించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం చేపట్టే అన్ని రకాల చర్యలు కేవలం ముందస్తులో భాగమేనని మంత్రి గంగుల పేర్కొన్నారు. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజలను కోరారు.

రాష్ట్రంలో 13కు చేరిన కరోనా బాధితులు…
రాష్ట్రంలో కరోనా వ్యాధిగురైనవారి సంఖ్య పదమూడుకు చేరుకుంది. నిన్నటివరకు అయిదుగురికి మాత్రమే ఈ వ్యాధిసోకిందని ప్రభుత్వం చెబుతుండగా, కరీంనగర్‌ ‌జిల్లాలో ఒకేసారి ఏడుగురికి ఈ వ్యాధి సోకిందని నిర్ధారణకావడంతో రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పదమూడుగా నమోదైంది. మార్చ్ 2‌న మొదటిపాజిటివ్‌ ‌కేసు నమోదైంది. సికిందరాబాద్‌ ‌మహేంద్రహిల్స్ ‌కాలనీకి చెందిన వ్యక్తి దుబాయినుండి వచ్చినప్పుడు ఈ వ్యాధిలక్షణాలున్నట్లు గుర్తించారు.

రెండవకేసు ఇటలీనుండి వచ్చిన అమ్మాయి, మూడవ కేసుగా నెదర్లాండ్‌నుండి వచ్చిన వ్యక్తిని, నాల్గవకేసుగా స్కాంట్లాండ్‌నుండి వచ్చిన వ్యక్తికి, ఇండోనేషియానుంచి వచ్చిన వ్యక్తిని అయిదవకేసుగా, లండన్‌ నుండి వచ్చిన మరో వ్యక్తితో కలిపి ఆరవకేసుగా గుర్తించారు. అయితే మొదలు చేరిన వ్యక్తివ్యాధి పూర్తి కావడంతో అతన్ని ఇంటికి పంపించగా మిగతావారికి చికిత్స కొనసాగుతున్నది. ఇప్పుడు తాజాగా కరీంనగర్‌లో ఈ వ్యాధిలక్షణాలతో ఏడుగురిని గుర్తించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలకోసం క్యాబినెట్‌తో అత్యవసర సమావేశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నిర్వహించారు.

Leave a Reply