Take a fresh look at your lifestyle.

దేశం ముంగిట కరోనా ఉపద్రవం

“డబ్యూహెచ్‌ఓ తాజాగా ఏం తేల్చిందంటే…కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని. అంటే వైరస్‌ కణాలు ఇంత వరకు అనుకున్నట్లు తక్కువ సమయంలోనే చనిపోవు. గాల్లో ఎక్కువ సేపు బతికి ఉండగలుగుతాయి, గాలి వీచే దిశను బట్టి దూరం ప్రయాణం కూడా చేయగలుగుతాయి. మూసి ఉన్న, వెంటిలేషన్‌ తక్కువ ఉన్న చోట గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందట. అయితే ఈ సమాచారం ప్రాధమిక ఆధారాలను బట్టి చెబుతున్నదే. లోతైన అధ్యయనం చేసి నిర్ధారించాల్సి ఉంది. ఒక వేళ ఇది నిజమని నిర్ధారణ అయితే ఇప్పుడు తీసుకుంటున్న నివారణ చర్యలు సరిపోవు. దీనికి అనుగుణంగా నివారణ చర్యలను who విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా అధ్యయనాలను బట్టి మనం కరోనా బారిన పడకుండా  అందరం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.”

rehanaఇప్పట్లో కరోనా ఉపద్రవం నుంచి ప్రపంచం బయటపడేటట్లు కనిపించటం లేదు. అందులోనూ మన దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళకరంగా మారుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. చూస్తుండగానే మనం కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే మూడో స్థానానికి వచ్చేశాం. కరోనా కేసుల మరణాల్లో ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నాం.

భయపెడుతున్న గణాంకాలు
శాస్త్రవేత్తలు, వైద్య రంగ నిపుణులు, పలు శాస్త్ర విజ్ఞాన సంస్థలు ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే జూన్‌ నెలాఖరుకే మనం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో నాలుగో స్థానానికి, ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకాం. కేసుల నమోదే కాదు పాజిటివిటీ రేటు కూడా ఆందోళన కలిగిస్తోంది. చేసిన టెస్టుల్లో ఎంత మందికి కరోనా పాజిటివ్‌ వస్తే దాన్ని పాజిటివిటీ రేటు అంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే వైరస్‌ ప్రజల్లో ఎక్కువగా ప్రబలి ఉందని అర్థం. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తే వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్‌ వచ్చిన వాళ్లను మిగిలిన వాళ్ల నుంచి వేరు చేసి చికిత్స అందిస్తారు కనుక. అసలు పరీక్షలే సరిగ్గా జరపకపోతే చాప కింద నీరులా ఈ మహమ్మారి చుట్టేస్తుంది. సగటున రోజుకు నమోదవుతున్న క‌రోనా కేసుల వృద్ధిరేటు కూడా మన దేశంలో ఎక్కువగా ఉంది. జూలై మొదటి వారం లెక్కలు చూస్తే అమెరికాలో రోజుకు సగటున 1.8% కేసులు పెరుగుతున్నాయి. ఈ సంఖ్య బ్రెజిల్‌లో 2.7%, రష్యాలో 1%, పెరూలో 1.2% గా ఉంటే…మన దగ్గర మాత్రం 3.5% గా నమోదయ్యింది. ప్రమాదం అంచున వేళ్లాడుతున్నాం అనటానికి ఇది ఒక సంకేతం.

రోజుకు రెండున్నర లక్షల కేసులా?
ఇప్పటికే ఈ మహమ్మారి ఎటు నుంచి ఎటు వెళుతుందో, ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో అని ఓ వైపు జనాలు భయపడుతుంటే…ప్రఖ్యాత మెశాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఎంఐటీ సంస్థ మరో బాంబు పేల్చింది. కరోనా విజృంభణ ఎలా ఉండనుందనే ఒక అధ్యయన నివేదికను వెల్లడించింది. వ్యాక్సిన్‌ గాని, చికిత్స గాని అందుబాటులోకి రాని పక్షంలో వచ్చే ఏడాది మార్చ్‌- మే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 24.9 కోట్ల మంది ఈ వైరస్‌ బారిన పడతారని, 18 లక్షల మంది మరణించ వచ్చని హెచ్చరించింది. శీతాకాలం నాటికి భార‌త్‌లో రోజుకు 2.87 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవకాశం ఉందని పేర్కోంది. ఈ ప‌రిశోధ‌న ప్రకారం భారత్‌, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఇండోనేసియా, బ్రిటన్‌, నైజీరియా, టర్కీ, ఫ్రాన్స్‌, జర్మనీలు తొలి పది స్థానాల్లో ఉంటాయి. 84 దేశాలకు చెందిన కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలించి ఎస్‌ఈఐఆర్‌ అనే నమూనాను అభివృద్ధి చేసినట్లు ఎంఐటీ పరిశోధకులు వెల్లడించారు. వీళ్లు చెప్పిన దాన్ని బట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు కరోనా కేసుల్లో మన దేశం అమెరికాను సైతం దాటి ముందుకు వెళుతుంది. ఈ పరిశోధన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల కంటే వాస్తవ పరిస్థితి 12 ఇంతలు ఎక్కువగా ఉందట. దీన్ని లెక్కల్లో గణిస్తే మన దేశంలో ప్రస్తుతం సుమారు 7 లక్ష 70 వేల కేసులున్నాయి. దీన్ని 12తో భాగిస్తే 92 లక్షల 40 వేలు. అంటే కరోనా కేసులు దేశంలో కోటికి దగ్గరలో ఉన్నట్లు. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా పద్నాల్గున్నర కోట్ల మంది వైరస్‌ బారిన పడినట్లు అవుతుంది. అదే విధంగా మరణాలు 50 శాతం ఎక్కువగా ఉన్నాయట. ఈ నివేదిక చదువుతుంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి కనిపిస్తోంది.

డబ్యూహెచ్‌ఓ తాజా హెచ్చరిక:
కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందనే అంశం పై ఇప్పటికే మన అందరికి కాస్త అవగాహన ఉంది. ప్రభుత్వాలు మొదలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని ఇప్పటి వరకు చెబుతూ వచ్చాయి. వైరస్‌ వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ తుంపర్ల ద్వారా గాల్లోకి వచ్చి దగ్గరలో ఉండే వ్యక్తుల శ్వాస నాళాల్లోకి ప్రవేశిస్తాయి అనేది స్ధూల అభిప్రాయం. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా చెప్పాయి. ఇలా గాల్లోకి వచ్చిన వైరస్‌ కణాలు ఎక్కువ సేపు గాల్లోనే ఉండి బతకలేవు, సమీపంలోని ఏదేని ఉపరితలం పై వాలతాయి. ఆ ఉపరితలాన్ని బట్టి (ప్లాస్టిక్‌, ఐరన్‌, చెక్క తదితరం) అక్కడ కొద్ది గంటల పాటు బతకి ఉండగలుగుతాయి. నిర్ధారిత సమయం తర్వాత వైరస్‌ మరణిస్తుంది అని చెబుతూ వచ్చాయి. అందుకే ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించటాన్ని తప్పనిసరి చేశాయి. శానిటైజర్‌ వాడటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం కూడా ఈ క్రమంలోనే తీసుకుంటున్న జాగ్రత్తలు. అయితే తాజా పరిణామాలు చూస్తే ఈ ఎపిసోడ్‌ ఇక్కడితో ఆగిపోలేదు. కరోనావైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను డబ్ల్యుహెచ్ఓ తక్కువ అంచనా వేస్తోందని ఆరోపిస్తూ 32 దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తలు బహిరంగ లేఖ రాయటం శాస్త్ర వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ఈ లేఖ కారణం కావచ్చు లేదా స్వయంగా కూడా కొంత అధ్యయనం చేసి కావచ్చు, డబ్యూహెచ్‌ఓ తాజాగా ఏం తేల్చిందంటే…కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని. అంటే వైరస్‌ కణాలు ఇంత వరకు అనుకున్నట్లు తక్కువ సమయంలోనే చనిపోవు. గాల్లో ఎక్కువ సేపు బతికి ఉండగలుగుతాయి, గాలి వీచే దిశను బట్టి దూరం ప్రయాణం కూడా చేయగలుగుతాయి. మూసి ఉన్న, వెంటిలేషన్‌ తక్కువ ఉన్న చోట గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందట. అయితే ఈ సమాచారం ప్రాధమిక ఆధారాలను బట్టి చెబుతున్నదే. లోతైన అధ్యయనం చేసి నిర్ధారించాల్సి ఉంది. ఒక వేళ ఇది నిజమని నిర్ధారణ అయితే ఇప్పుడు తీసుకుంటున్న నివారణ చర్యలు సరిపోవు. దీనికి అనుగుణంగా నివారణ చర్యలను who విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా అధ్యయనాలను బట్టి మనం కరోనా బారిన పడకుండా అందరం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply