Take a fresh look at your lifestyle.

దేశంలో కొత్తగా లక్షా నలబై వేలకు పైగా కేసులు నమోదు

  • కేసుల సంఖ్య గణనీయంగా 21 శాతం పెరుగుదల
  • 3,071కు చేరిక ఒమిక్రాన్‌ ‌కేసులు

న్యూ దిల్లీ, జనవరి 8 : దేశంలో కొరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ముందురోజు గురువారం కంటే శుక్రవారం 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌కేసులు 3 వేలపైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల మేరకు … శుక్రవారం 15 లక్షల మందికి పైగా కొరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్‌ ‌పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌కేసులు 3,071 గా ఉన్నాయి. అందులో 1,203 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ ‌విస్తరించిందని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 876 మంది దీని బారిన పడగా.. ఢిల్లీలో ఆ సంఖ్య 513కి చేరింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ‌ఢిల్లీ, కర్నాటక, తమిళనాడులో వైరస్‌ ‌విజృంబిస్తుంది. ఒక్క మహారాష్ట్రలో 40 వేల కేసులు నమోదయ్యాయి. ముంబయిలో వెలుగుచూసిన కేసుల సంఖ్య 20,971గా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 18 వేలు, ఢిల్లీలో 17 వేల కేసులు నమోదయ్యాయి. మిజోరంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి చేరింది. దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా ఐదు లక్షలకు చేరాయి.

ప్రస్తుతం 4,72,169 మంది వైరస్‌ ‌బారినపడ్డారు. క్రియాశీల రేటు 1.34 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 97.30 శాతానికి తగ్గింది. నిన్న 40,895 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3.44 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.8 లక్షల మంది మృతి చెందారు. నమోదు కాని మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌ ‌నాటికే దేశంలో దాదాపు 32 లక్షల కోవిడ్‌ ‌మరణాలు సంభవించి ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది. కోవిడ్‌ ‌నివారణకుగాను దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగంగా కొనసాగుతుంది. ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ 150 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 90 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. జనవరి మూడు నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్‌ ‌కొనసాగుతున్న సంగతి విదితమే. కేవలం ఎనిమిది రోజుల్లోనే కొరోనా మహమ్మారి ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారీ కరోనా కేసులు మళ్లీ లక్ష మార్క్ ‌దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ ‌దాటి.. లక్షన్నరకు చేరువయ్యారు.

Leave a Reply