Take a fresh look at your lifestyle.

దేశంలో రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న కొరోనా కేసులు

  • 24 గంటల్లో 54,069 మందికి పాజిటివ్‌ ‌నమోదు…1321 మంది మృతి
  • డెల్టా వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎయిమ్స్ ‌చీఫ్‌

అన్ని వేరియంట్‌లను తట్టుకునేలా టీకా తయారీ…కొరోనా వైరస్‌లపై ‌ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశోధనలు
దేశవ్యాప్తంగా కొరోనా కేసులు తగ్గుతున్నాయని..కాస్త ఊపిరి పీల్చుకోవొచ్చని అనుకుంటున్న క్రమంలో రెండు రోజులుగా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో ఒక్కరోజే కొత్తగా 54,069 కొరోనా కేసుల నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,00,82,778లకు చేరింది. అలాగే బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1321 మంది ప్రాణాలు కోల్పోవటంతో మృతుల సంఖ్య మొత్తం 3,91,981కు పెరిగింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా 68,885 మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. దేశంలో కొరోనా నుంచి ఇప్పటివరకు 2,90,63,740 మంది కోలుకున్నారు. 6,27,057 మందికి ప్రస్తుతం హాస్పిటళ్లలో, హోం క్వారంటైన్‌లలో చికిత్సలు కొనసాగుతున్నాయి. కొరోనాను నియంత్రించటానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతున్న క్రమంలో మొత్తం 30,16,26,028 టీకా డోసులు వేశారు. కాగా..భారత్‌లో బుధవారం వరకు మొత్తం 39,78,32,667 కొరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్‌ ‌తెలిపింది.

నిన్న 18,59,469 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మరోవైపు కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రభావం కాస్త తగ్గింది. అయితే మూడో వేవ్‌ ‌ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరుణంలో డెల్టా, డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ రకం వేరియంట్‌లు ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాపించాయని తెలుస్తున్నది. డెల్టా ప్లస్‌ ‌వేరియంటే థర్డ్ ‌వేవ్‌కు కారణమవుతుందని ఇప్పుడే చెప్పలేమని ఢిల్లీ ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌ ‌దీప్‌ ‌గులేరియా అన్నారు. అయితే డెల్టా వేరియంట్‌ ‌నుంచే ఇది మ్యూటెంట్‌ అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తాయన్నారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే కట్టడి చేయాలన్నారు. లేకపోతే సెకండ్‌ ‌వేవ్‌ ‌లాగా పరిస్థితి చేయిదాటి పోతుందన్నారు. వేరియంట్‌ ఏదైనా మనం తీసుకునే జాగ్రత్తలే కీలకమన్నారు. చిన్నపిల్లలపై థర్డ్ ‌వేవ్‌ ఎఫెక్ట్ ఉం‌డదని మరోసారి చెప్పారు. 2 నుంచి 18ఏళ్లున్న వాళ్లకు వ్యాక్సినేషన్‌ ‌ట్రయల్స్ ‌కొనసాగుతున్నాయన్నారు. 2 నుంచి 3 నెలల్లో ఫలితాలు వొస్తాయన్నారు. ట్రయల్స్‌కు వొచ్చిన చిన్నారుల్లో సగానికి పైగా మందికి ఆల్‌ ‌రెడీ యాంటీబాడీస్‌ ఉం‌టున్నట్లు గుర్తించామన్నారు. అయితే వారికి కొరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదన్నారు. పిల్లల్లో ముందే యాంటీబాడీలు డెవలప్‌ అవడాన్ని బట్టి చూస్తే థర్డ్ ‌వేవ్‌ ‌వారిపై పెద్దగా ప్రభావం చూపించబోదన్నారు.

అన్ని వేరియంట్‌లను తట్టుకునేలా టీకా తయారీ…కొరోనా వైరస్‌లపై ప్రంచ వ్యాప్తంగా కొత్త పరిశోధనలు
వాషింగ్టన్‌, ‌జూన్‌ 24 : ‌కొరోనాను తరిమికొట్టకుండా డెల్టా వేరియంట్‌ ‌తమను అడ్డుకుంటుందని అమెరికా వైద్య నిపుణుడు, వైట్‌ ‌హౌస్‌ ‌చీఫ్‌ ‌మెడికల్‌ అడ్వయిజర్‌ ‌ఫౌసీ అన్నారు. ఈ నేపథ్యంలో సైంటిస్టులు కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అన్ని కొరోనా వేరియంట్‌లను తట్టుకునేలా సార్వత్రిక టీకాను రూపొందించే పనిలో పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్‌ ‌నార్త్ ‌కొరోలినా సైంటిస్టులు యూనివర్సల్‌ ‌టీకాను తయారు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వీళ్లు ఓ హైబ్రిడ్‌ ‌టీకాను రూపొందించారు. సూపర్‌ ‌టీకాగా పిలుస్తున్న ఈ టీకా..భవిష్యత్‌లో వొచ్చే కొరోనా వేరియంట్‌ల నుంచి కూడా రక్షణను అందిస్తుందని సమాచారం. ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించగా సక్సెస్‌ అయ్యామని సైంటిస్టులు తెలిపారు. ఈ టీకా ఎలుకల్లో ప్రవేశపెట్టిన కొరోనా వైరస్‌ను ప్రభావవంతంగా అడ్డుకోవడమే కాకుండా ఊపిరితిత్తులకూ రక్షణ కల్పించిందని చెప్పారు. కొరోనా కుటుంబం నుంచి ఏ రకం వైరస్‌ ‌వొచ్చినా సమర్థంగా అడ్డుకునేందుకు టీకా తయారీపై దృష్టి సారించామన్నారు. మరింత అధ్యయనం తర్వాత వొచ్చే ఏడాది మనుషులపై ప్రయోగాలకు రెడీ అవుతున్నామని పేర్కొన్నారు.

Leave a Reply