Take a fresh look at your lifestyle.

కొరోనా కేసులు దేశంలో పెరుగుతుంటే.. రాష్ట్రంలో తగ్గుముఖం

  • కొత్తగా 13 కేసులు, 983కు చేరిక, ఇకపై రోజుకు 50 మంది డిశ్చార్జి
  • లక్ష కేసులు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం
  • వైరస్‌ ‌కట్టడికి తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసిస్తోంది
  • వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రాష్ట్రంలో ఆ సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 13 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, మొత్తంగా ఇప్పటి వరకునమోదైన కేసుల సంఖ్య 983కు చేరిందని వెల్లడించారు.గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 554 మందికి పైగా కొరోనా పరీక్షలు నిర్వహించామనీ, చికిత్సలలో కోలుకోగా మరో 29 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రతీరోజూ 50 మంది వరకూ కోలుకున్న వారిని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం కోఠిలోని కంట్రోల్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులలో కేవలం నాలుగు ప్రాంతాల నుంచే ఎక్కువగా కొరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలోని 44 కుటుంబాల ద్వారా 265 మందికి, వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కొరోనా సోకిందని వివరించారు. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చామనీ, కొరోనా బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.

కొరోనా రోగులకు పౌష్టికాహారం అందించడం లేదని వస్తున్న వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదనీ, ఆసుపత్రి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారిని కనుక్కుంటే వాస్తవం తెలుస్తుందన్నారు. వైద్యులపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనీ, అలాంటి సంఘటనలు జరిగితే ఆసుపత్రినే జైలుగా మార్చాలని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. హైదరాబాద్‌, ‌గద్వాల, సూర్యాపేట, వికారాబాద్‌లోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నారు. కొరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను కేంద్ర మంత్రి సైతం ప్రశంసించారనీ, దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ 9 ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ లక్ష కేసులు వచ్చినా పరీక్షలు చేయడానికి, అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్యులెవరికీ కొరోనా సోకలేదనీ, రాష్ట్రంలో ఇప్పటి వరకు కొరోనా కారణంగా మృతి చెందిన రోగులలో బీపీ, షుగర్‌, ‌గుండెనొప్పి వంటి తీవ్రమైన జబ్బులు ఉన్న వారేనని వివరించారు. కొరోనా ప్రభావిత ప్రాంతాలలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్కులు అందలేదని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్‌95 ‌మాస్కుల కోసం ఆర్డరిచ్చిందని తెలిపారు. ప్లాస్మా థెరపీ కోసం దరఖాస్తు చేసే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Leave a Reply