- తాజాగా 2,82,970 మందికి పాజిటివ్..441 మంది మృతి
- యూపిలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదు
- టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
- టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలి: హెల్త్ వర్కర్లను కోరిన భారత్ బయోటెక్
న్యూ దిల్లీ, జనవరి 19 : దేశంలో కొరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. మరోవైపు మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే సందర్భంలో కొరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని తాజాగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా కొరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు..రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కాగా..తాజాగా 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా మంగళవారం 2,82,970 కేసులు నమోదయ్యాయి. కాగా మహమ్మారి కారణంగా ఒక్క రోజే 441 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోల్చుకుంటే.. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 44,889 కేసులు, 131 మరణాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. మరోవైపు..దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతుంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15,13 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 18,31,000 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా తాజాగా కొరోనా నుంచి 1,88,157 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,55,136,039 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కొరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తుంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే..ఒమిక్రాన్ కేసుల సంఖ్య 0.79 శాతం పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో 158.50 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 76.35 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. కాగా ఈ భయాందోళనల మధ్య గతేడాది సెకండ్ వేవ్‌లో వణుకుపుట్టించిన బ్లాక్ ఫంగస్ మళ్ళీ పంజా విసిరడం ప్రారంభించింది. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో హాస్పిటల్లో చేరాడు. బ్లాక్ ఫంగస్ అతని కన్ను, ముక్కుకు వ్యాపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కొరోనా థర్డ్ వేవ్‌లో ఇదే తొలి కేసని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి షుగర్ కారణంగా బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు కాన్పూర్ జీఎస్వీఎమ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కలా తెలిపారు. ఇతను కాన్పూర్ లోని కాంట్ నివాసి అని తెలిపారు. ఫంగస్ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన విషయం విదితమే.
టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలి : హెల్త్ వర్కర్లను కోరిన భారత్ బయోటెక్
15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్స్‌కు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ హెల్త్ వర్కర్లను కోరింది. అప్రూవ్ చేయని టీకా ఇస్తున్నట్టు తమ దృష్టికి వొచ్చిందని తెలిపింది. టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్ విషయంలో హెల్త్ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు 12 నుంచి 14 ఏళ్ల వారికి టీకా ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక కోవిడ్ రోగులు వారం కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉంటే.. టీబీ, ఇతర పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కొరోనా పేషెంట్స్‌కు స్టెరాయిడ్లు ఇస్తే..బ్లాక్ ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వొచ్చే ప్రమాదం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా ఫిబ్రవరి చివరి వారంలోగా టీనేజర్లకు టీకా పంపిణీ పూర్తి చేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సెకండ్ డోస్, బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్‌ను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.