Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో దేశవ్యాప్తంగా కొరోనా కేసులు.. 2,293

భారత్‌లో కొరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,293 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో కొరోనా బారినపడ్డవారి సంఖ్య37,776కు పెరిగింది. ఇక కొత్తగా 71 మందిని మహమ్మారి బలిగొనడంతో దేశంలో మృతుల సంఖ్య 1,218కి చేరింది. ఇప్పటి వరకు 9,951 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. వైరస్‌ ‌తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 11,506కు చేరింది. వీరిలో 485 మంది మృత్యువాతపడగా.. 1,879 మంది కోలుకున్నారు. ఇక తర్వాత గుజరాత్‌లో 4,721 కేసులు నమోదవ్వగా.. 236 మంది మృతిచెందారు. 735 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకుగాను విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదివరకు విధించిన లాక్‌డౌన్‌ ‌గడువు ఆదివారంతో ముగిసిపోనుండగా.. తాజా పొడిగింపు నేపథ్యంలో అది ఈ నెల 17 వరకు అమల్లో ఉండనుంది. అయితే- కరోనా తీవ్రత ఆధారంగా వర్గీకరించిన రెడ్‌, ఆరెంజ్‌, ‌గ్రీన్‌ ‌జోన్లలో పలు పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం తాజాగా అనుమతులు ఇచ్చింది. గ్రీన్‌ ‌జోన్లలోని జిల్లాల్లో అంతర్గతంగా బస్సులను నడిపించేందుకు పచ్చజెండా ఊపింది. ఏ జోన్‌లోనైనాసరే కంటెయిన్‌మెంట్‌ ‌ప్రాంతాల పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాలకూ అనుమతి ఉండదు. దేశంలోని 733 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, ‌గ్రీన్‌ ‌జోన్లుగా వర్గీకరిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర సిఎం వ్యక్తిగత సిబ్బందికి కొరోనా
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ‌విలయతాండవం చేస్తోంది. ఇక్కడ సామాన్యులతోపాటు భద్రతాసిబ్బంది, వైద్యులు కూడా కొవిడ్‌ ‌బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే నివాసం ’మాతోశ్రీ’ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించి వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.

Leave a Reply