Take a fresh look at your lifestyle.

జూన్‌లో వందలు .. జూలైలో వేలు..!

  • నెల వ్యవధిలోనే భారీగా కొరోనా కేసులు
  • పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం
  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చర్యలు

తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ ‌ప్రభావం  రాష్ట్రంలో ఏప్రిల్‌ ‌నెల తొలి వారంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పది లోపునే నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య వందలు దాటి వేలల్లోకి చేరింది. వైరస్‌ ‌తీవ్రతను ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోవడంతో అసలు రాష్ట్రంలోకి కొరోనా వచ్చే అవకాశాలు లేనే లేవనీ, ఒకవేళ వచ్చినప్పటికీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా మనుగడ సాధించలేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలకు వైరస్‌ ‌రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ దీని పట్ల ఏ విధంగా వ్యవహరించాలో, నియంత్రణ పద్దతులపై స్పష్టమైన అవగాహన రాలేదు. కొరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా దానినే అనుసరించడంతో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చినట్లే కనిపించింది.

అయితే, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అప్పటి వరకు రాష్ట్రంలోని కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, ‌నల్లగొండ వంటి ప్రాంతాలలో పదుల సంఖ్యలో కొరోనా కేసులు నమోదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వ స్థానిక యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇక జూన్‌ ‌నెల ప్రారంభంలోని తొలి రెండు రోజులలో సైతం రాష్ట్రంలో వందలోపే కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండేది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రాగా, దాదాపు 90 శాతానికి పైగా కేసులు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోనివే కావడం గమనార్హం.  జూన్‌ ‌నెల మొదటి వారంలో, జూలై తొలి వారంలో రాష్ట్రంలో, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్యను తేదీల వారీగా ఒకసారి పరిశీలిస్తే….

corona cases

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య భారీగా నమోదు కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రతీ రోజూ టెస్టులను అతి తక్కువ సంఖ్యలో చేయడం, మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదంటూ వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గత నెల వరకూ అటు రాష్ట్రంలో ఇటు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కేసులు అంత ఎక్కువ సంఖ్యలో నమోదు కాలేదు. మరోవైపు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ప్రతీ రోజూ వేల సంఖ్యలో టెస్టులు చేయడంతో పాటు పాజిటివ్‌ ‌వచ్చిన వారికి వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన చికిత్సలు అందించడం, తక్కువ లక్షణాలు ఉన్న వారిని హోం క్వారంటైన్‌ ‌చేయడం వంటి చర్యలు చేపట్టడంతో అక్కడ వేగంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం లేదనీ, దీంతో వైరస్‌ ‌చాపకింద నీరులా విస్తరిస్తున్నదని అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పాటు హైకోర్టులోనూ రాష్ట్రంలో కొరోనా కట్టడి నివారణలో భాగంగా ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు నమోదు కావడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను వెంటనే పెంచాలనీ, ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా వైరస్‌ ‌నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి నుంచి రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసుల సంఖ్య వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొరోనా విజృంభిస్తున్న దృష్ట్యా హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో 50 వేల టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో నిద్ర మేల్కొన్న ఆ శాఖ అధికారులు టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచడంతో కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతూ వస్తున్నది. జూలై నెల తొలి వారంలో నమోదైన కేసుల సంఖ్యను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే మేల్కొని ఉంటే కొరోనా వైరస్‌ను చాలా వరకు కట్టడి చేయగలిగి ఉండేదనీ, ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో కేసుల నమోదయ్యే పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply