Take a fresh look at your lifestyle.

చిత్తూరు జిల్లాలో కరోనా తగ్గుముఖం

  • కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆళ్లనాని

తిరుమల,ఆగస్ట్ 6 : ‌చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅవుతున్నా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఎప్పటికప్పుడు సక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించానని తెలిపారు. అన్ని వార్డుల్లో తిరిగి, బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు.

స్వీమ్స్‌లో వైద్యసేవలు చాలా బాగున్నా యని, మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారని మంత్రి ఆళ్ల  నాని వెల్లడించారు.  తిరుమల శ్రీవారిని  ఆళ్ల నాని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో అల్పాహారం అనంతరం ఆయన తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని  విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌కరోనా నియంత్రణకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రోజూ 50 వేల నుంచి 60 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపడమే సీఎం ధ్యేయం. కరోనా నియంత్రణకు నెలకు దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply