కొత్తగా 80,472 మందికి పాజిటివ్
వ్యాక్సిన్‌కు అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయన్న కేంద్రం
భారత్‌లో కొరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముందురోజు కేసులు, మరణాల సంఖ్య తగ్గినప్పటికీ తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24గంటల్లో 80,472 కొరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 62,25,763కు చేరింది. వీరిలో ఇప్పటికే 51,87,826 మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 86,428 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 40వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కొరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 1179 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కొరోనా సోకి మరణించిన వారిసంఖ్య 97,497కి చేరింది. ప్రస్తుతం దేశంలో కొరోనా బాధితుల రికవరీ రేటు 83.33శాతం ఉండగా, మరణాల రేటు 1.57శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా నిన్న 10,86,688 కొవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 7కోట్ల 41లక్షల టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
వ్యాక్సిన్‌కు అవసరమైన నిధులుఉన్నాయి; కేంద్రం
దేశంలోని ప్రతి పౌరుడికి కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించేందుకు కావాల్సిన మొత్తం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని అధర్ పూనావాలా చేసిన వ్యాఖ్యలపై కేంద్రసర్కారు తీవ్రంగా స్పందించింది. పూనావాలా వ్యాఖ్యలపై మూడు రోజుల తర్వాత విభేదించింది. ఆయన చెప్పిన లెక్క సరైనది కాదని పేర్కొంది. భారతదేశంలో కొవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ కోసం రూ. 80,000 కోట్లు అవసరమనే పూనావాలా వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ వెల్లడించారు. ‘ఆయన చెప్పిన లెక్కను మేం అంగీకరించం. టీకాపై ప్రభుత్వం జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఐదు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ పక్రియకు కావాల్సిన మొత్తాన్ని లెక్కించాం. ఆ మొత్తం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంది.’ అని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.