Take a fresh look at your lifestyle.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి
ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 12,591 కొత్త కొరోనా కేసులు నమోదై..ఎనిమిది నెలల గరిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65,286 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇక కొరోనాతో బుధవారం ఒక్కరోజే 40 మంది మృతి చెందారు. అత్యధికంగా కేరళలో 11 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తాజా మరణాలతో కలిపి కోవిడ్‌ ‌ప్రారంభం నుంచి ఇప్పటివరకు కోవిడ్‌ ‌మరణాల సంఖ్య 5,31,230కు చేరింది. ఇక పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది.

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,61,476కి చేరింది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ ‌సమాచారం ప్రకారం కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌లో భాగంగా 220.66 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది. ఇదిలావుంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ అని తేలింది. ఆయన నేడు న్యూఢిల్లీలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ‌కమాండర్స్ ‌సమావేశంలో పాల్గొనాల్సి ఉండింది. కానీ కోవిడ్‌ ‌పాజిటివ్‌ అని పరీక్షలో తేలాక ఆయన ఆ సమావేశానికి హాజరు కాబోడంలేదు. ప్రస్తుతం ఆయన హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు కోవిడ్‌ ‌లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. డాక్టర్ల బృందం ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించారు. ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాకు కూడా కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ అని తేలింది. ఆయన సోమవారం ఈ విషయాన్ని ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply